Anakapalli YCP: ఉత్కంఠకు తెరపడింది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని వైసీపీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 24 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి జగన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కానీ ఒక్క అనకాపల్లి పార్లమెంటు సీటును మాత్రం పెండింగ్ లో పెట్టారు. రకరకాల రాజకీయ సమీకరణలను పరిగణలోకి తీసుకొని అక్కడ అభ్యర్థిని ప్రకటించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇప్పటికే ఆయన పేరును మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఈ కీలక మార్పు వైసీపీలో చర్చకు దారితీస్తోంది. అటు రాజకీయంగాను సంచలనంగా మారింది.
అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో వెలమలు అధికం. అందుకే ఇక్కడ బిజెపి అభ్యర్థిగా సీఎం రమేష్ పేరును ప్రకటించారు. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. కడప జిల్లాకు చెందిన ఆయన ఓసి వెలమ. అనకాపల్లి ఎంపీ సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. దీంతో ఇక్కడ పోటీ చేసేందుకు చాలా మంది ఆశావహులు ముందుకు వచ్చారు. ఒకానొక దశలో పివిఎన్ మాధవ్ పేరు వినిపించింది. ఆయన సైతం వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. కానీ సీఎం రమేష్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అందుకే బిజెపి నుంచి అనకాపల్లి సీటు దక్కించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. సీఎం రమేష్ వెలమ కావడంతో సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడును జగన్ఎం పిక చేసినట్లు తెలుస్తోంది.
తొలుత అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ఇక్కడ నుంచి నాగబాబు పోటీ చేస్తారని టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఈ పార్లమెంట్ స్థానంపై నాగబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ లోకసభ స్థానం పరిధిలోని ఎలమంచిలిలో ఇంటిని అద్దెకు కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ స్థానిక అంశానికి పెద్దపీట వేస్తారని.. లోకల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందని టాక్ నడిచింది. మరోవైపు పొత్తుల్లో భాగంగా జనసేన అనకాపల్లి సీటును వదులుకుంది. బిజెపికి కేటాయించింది. బిజెపి సీఎం రమేష్ పేరును ప్రకటించింది. అయితే సీఎం రమేష్ ఆర్థికంగా బలమైన నేత. ఆపై వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన బండారు సత్యనారాయణమూర్తిని వైసీపీలోకి రప్పించి టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు. బండారు కు పెందుర్తి అసెంబ్లీ సీటు టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఆయన తప్పకుండా వైసీపీలోకి వస్తారని భావించారు. కానీ కింజరాపు కుటుంబంతో ఉన్న బంధుత్వంతో ఆయన వెనుకడుగు వేశారు. దీంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడును జగన్ ఎంపిక చేశారు.
ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీ సీటుకు రావడంతో.. ఆయన స్థానంలో ఈర్లే అనురాధ అనే మహిళ నేతకు మాడుగుల అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆమె ఎవరో కాదు ముత్యాల నాయుడు కుమార్తె. ప్రస్తుతం అదే నియోజకవర్గంలోని కే. కోటపాడుకు జడ్పిటిసి గా వ్యవహరిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయగా ఆమె గుర్తింపు దక్కించుకున్నారు. మంత్రిగా ముత్యాల నాయుడు బిజీగా ఉండడంతో పార్టీ వ్యవహారాలను ఆమె చక్కబెడుతుంటారు. దీంతో జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు. అయితే అనకాపల్లి ఎంపీ స్థానానికి గట్టి ఫైట్ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.