Adhika Masam 2026 : గత కొన్ని నెలలుగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభకార్యాలతో కళకళలాడిన వాతావరణానికి ఇప్పుడు తాత్కాలిక విరామం ఏర్పడింది. హిందూ పంచాంగం ప్రకారం ప్రస్తుతం (మే 16 నుంచి) అధిక జ్యేష్ఠ మాసం కొనసాగుతుండటంతో జూన్ 18 వరకు మంచి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో వివాహాలు, కొత్త ఇళ్లలో ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటి శుభకార్యాలు చాలావరకు వాయిదా పడుతున్నాయి. అసలు అధిక మాసం అంటే ఏమిటీ?
హిందూ సంప్రదాయంలో అధిక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చంద్ర సంవత్సరానికి, సౌర సంవత్సరానికి మధ్య వచ్చే తేడాను సరిచేయడానికి సుమారు మూడు సంవత్సరాలకు ఒకసారి అదనంగా వచ్చే నెలను అధిక మాసం గా పరిగణిస్తారు. దీనిని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, దానధర్మాలకు అనుకూలంగా భావిస్తారు. అయితే వివాహాలు, శుభారంభాలు వంటి మంగళకార్యాలకు మాత్రం ఈ కాలాన్ని నివారించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
పండితులు చెబుతున్న ప్రకారం.. ఈ కాలంలో శుభకార్యాలు చేయకుండా దేవారాధన, వ్రతాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రారంభాలు, వాహన కొనుగోళ్లు, భూముల రిజిస్ట్రేషన్లు వంటి పనులను ముహూర్తాలు ప్రారంభమైన తర్వాతే చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఇప్పటికే బుక్ చేసుకున్న కొన్ని కార్యక్రమాలు కూడా వాయిదా పడుతున్నాయని తెలుస్తోంది.
ఈ ప్రభావం కేవలం కుటుంబాలకే కాకుండా శుభకార్యాలపై ఆధారపడే అనేక వ్యాపార రంగాలపై కూడా పడుతోంది. ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, డెకరేషన్ వ్యాపారులు, టెంట్ హౌస్ నిర్వాహకులు, క్యాటరింగ్ సర్వీసులు, బ్యాండ్ బాజా బృందాలు, ఫోటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు వంటి వారికి నెలరోజులపాటు పనులు తగ్గనున్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో బిజీగా ఉండే ఈ రంగాలు ఇప్పుడు వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యేకంగా వివాహ సీజన్‌పై ఆధారపడే చిన్న వ్యాపారులు ఈ గ్యాప్ వల్ల ఆదాయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు ఇప్పటికే అడ్వాన్స్‌లు తీసుకున్న కార్యక్రమాలను జూన్ చివరి వారానికి మార్చినట్లు చెబుతున్నారు. మరోవైపు మంచి ముహూర్తాలు మళ్లీ ప్రారంభమైన తర్వాత భారీగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధిక మాసాన్ని చాలా మంది భక్తి, ఆధ్యాత్మికతకు కేటాయిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పారాయణాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ సమయంలో శుభకార్యాల కంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని పెద్దలు చెబుతున్నారు.
జూన్ 18 తర్వాత మళ్లీ మంచి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సందడి మళ్లీ మొదలయ్యే అవకాశముంది. ఇప్పటికే చాలామంది కుటుంబాలు ఆ తేదీల కోసం ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలు ముందుగానే బుక్ చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.
