Abhishek Sharma poor form : అతడు మైదానంలోకి దిగితే సునామి క్రికెట్ ఆడినట్టుగా ఉంటుంది. అతడు బ్యాట్ తో బంతిని కొడితే.. విధ్వంసం కళ్ళ ముందు కనిపిస్తుంది. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ ఉంటే ప్రళయం సెంటీమీటర్ దూరం నుంచి వెళ్లినట్టు ఉంటుంది. అతడికి బంతితో సంబంధం ఉండదు. బౌలర్ తో సంబంధం ఉండదు. భయం అనేది తెలియదు. వచ్చాడా.. విలయం సృష్టించి వెళ్ళాడా.. ఇదే సూత్రాన్ని పాటిస్తూ ఉంటాడు. అందువల్లే అతడు అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ఆవిర్భవించాడు.
ఇదంతా చదివిన తర్వాత ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది.. మేం చెబుతున్నది అభిషేక్ శర్మ గురించి అని. టి20 ఫార్మేట్ లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు అభిషేక్ శర్మ. ఐపీఎల్ లో అతడు కాటేరమ్మ కొడుకుగా పేరు గడించాడు. ముఖ్యంగా 2024, 2025 సీజన్లలో దుమ్మురేపాడు. మైదానంలో పరాక్రమాన్ని సృష్టించాడు. అటువంటి అభి షేక్ ఇప్పుడు బ్యాటింగ్ చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. పరుగుల వరద పారించిన అతడు సున్నాలతో పోటీ పడుతున్నాడు.
2026లో ఇప్పటివరకు అతడు ఆరుసార్లు డక్ ఔట్ అయ్యాడు. టి20, ఐపీఎల్ లను పరిగణలోకి తీసుకుంటే.. అతడు అత్యంత నిర్లక్ష్యమైన షాట్లు ఆడి.. ఆరుసార్లు డక్ అవుట్ అయ్యాడు.. ఆదివారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు 0 పరుగులకు అవుట్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అభిషేక్ శర్మ మాదిరిగానే 2024లో సంజు శాంసన్ ఆరుసార్లు డక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. కీలకమైన మ్యాచులలో అవకాశం కోల్పోయాడు. చివరికి తనను తాను నిరూపించుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. 2026 t20 వరల్డ్ కప్ లో వరుస హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
2018లో రోహిత్ శర్మ కూడా ఆరుసార్లు డక్ ఔట్ అయ్యాడు. పరుగులు తీయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ సంవత్సరంలో రోహిత్ ఎదుర్కొన్న ఒత్తిడి మాములుది కాదు. అతడు సరిగ్గా పరుగులు తీయలేకపోవడంతో సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రోహిత్ తన బ్యాటింగ్ స్టైల్ మొత్తాన్ని మార్చుకున్నాడు. చివరికి టీమిండియా కు డైనమైట్ లాగా మారాడు.
అభిషేక్ సరైన ఫామ్ లో లేకపోవచ్చు. కాకపోతే అతడికి ఫామ్ అనేది లెక్కలోది కాదు. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో అతడు సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్ లో విఫలమవుతున్నప్పటికీ.. త్వరలోనే అతడి బ్యాట్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ వస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు.