https://oktelugu.com/

Crime News : మరి కొద్ది గంటల్లో ఎంగేజ్మెంట్.. అంతలోనే ఘోరం.. మాటలకందని విషాదం..

అన్ని బాగుంటే.. అనుకున్నట్టు జరిగితే ఈ సమయానికి వాళ్ళ ఇంట్లో బంధువుల సందడి ఉండేది. స్నేహితుల ఆటపాటలు ఉండేవి. చుట్టుపక్కల వాళ్ళ రాకపోకలు కొనసాగేవి. అన్నింటికంటే ముఖ్యంగా తనకు కాబోయే వాడితో ఆమెకు నిశ్చితార్థం జరిగేది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 17, 2024 / 03:18 PM IST

    Crime News

    Follow us on

    Crime News :  కానీ మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించడంతో.. 24 సంవత్సరాల యువతి ఆశలు అడియాసలయ్యాయి. కలలు కాలగర్భంలో కలిసిపోయాయి. కన్నవాళ్ళ కోరికలు కన్నీటి సముద్రంలో మునిగిపోయాయి. ఈ విషాదకరమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జరిగింది. చూడ్డానికి చక్కని రూపం.. నిందైన మొఖం.. అందమైన చిరునవ్వుతో ముద్దమందారంలా ఉన్న 24 సంవత్సరాల జ్యోతి ట్రాక్టర్ చక్రాల కింద పడి నలిగిపోయింది. నెత్తుటి ప్రవాహంలో కొట్టుకుంటూ చనిపోయింది. తాడిపత్రి మండలంలోని వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ రెడ్డి, లక్ష్మీ దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు గీత, బిందు, కుమారుడు నారాయణరెడ్డి ఉన్నారు. వీరిలో గీత, బిందు, నారాయణరెడ్డి బీటెక్ చదివారు. పెద్ద కూతురికి 24 సంవత్సరాల వయసు రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మీదేవి సూచన మేరకు ఇటీవల కాలంలో కొన్ని పెళ్లి సంబంధాలు చూశారు. అందులో ఒక సంబంధం వారికి నచ్చింది. అబ్బాయి వైపు కూడా అవే సంకేతాలు రావడంతో ఆదివారం నిశ్చితార్థం జరపడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.. అయితే నిశ్చితార్థ వేడుకలు తన చేతులు ఎర్రగా ఉండాలని.. అందంగా కనిపించాలని గీత గోరింటాకు పెట్టుకోవాలని భావించింది. సోదరుడు నారాయణరెడ్డి తో కలిసి ద్విచక్ర వాహనంపై తాడిపత్రి వెళ్ళింది. అక్కడ గోరింటాకు కోసుకున్న తర్వాత ఇద్దరు మళ్ళీ అదే బైక్ పై తమ ఇంటికి బయలుదేరారు.

    ట్రాక్టర్ ఢీ కొట్టింది

    గీత తన సోదరుడు నారాయణరెడ్డి తో కలిసి బైక్ పై బయలుదేరగా.. మార్గమధ్యలో ఒక ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గీత సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందింది. నారాయణ రెడ్డి తలకు తీవ్రమైన గాయం తగిలింది. రక్త స్రావం కావడంతో అతడిని వెంటనే తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మరికొద్ది గంటల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. ఈ ప్రమాదం జరగడం శ్రీరామ్ రెడ్డి- లక్ష్మీదేవి దంపతులను కలచివేస్తోంది..”మరికొద్ది గంటల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండేది. బంధువులు మొత్తం వచ్చారు. స్నేహితులను పిలిచాను. ఘనంగా నిశ్చితార్థం జరపడానికి ఏర్పాట్లు చేశాను. దీనికోసం భారీగా ఖర్చు పెట్టాను. కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగింది. ఎవరికి ఎటువంటి హాని నేను తలపెట్టలేదు. ఉన్నంతలోనే గొప్పగా బతుకుతున్నాను. ముగ్గురు పిల్లల్ని చదివించాను. ఉన్న ఒక్క కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. కుమార్తె చనిపోయింది.. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దని” శ్రీరామ్ రెడ్డి దంపతులు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. అయితే ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. శ్రీరామ్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.