https://oktelugu.com/

Telangana : రీల్స్ చేసినందుకు 15 కోట్లు.. నాటి ప్రభుత్వ ప్రచార పిచ్చి పీక్స్.. వెలుగులోకి సంచలన నిజం

ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజా సమస్యల కోసం కృషి చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రజలను పథకాలకు బానిసలు చేసి.. రాష్ట్రాలను అప్పుల కుప్పలుగా మార్చి.. జనం నెత్తిన భారం వేసే కార్యక్రమాలు దర్జాగా సాగిపోతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : November 11, 2024 6:37 pm

Telangana

Follow us on

Telangana :  ప్రభుత్వ భూములను అమ్మటం.. అలా వచ్చిన డబ్బుతో దీర్ఘకాలిక పనులు చేయకుండా.. ఏదో ఒక పథకానికి కొంతమేర ఖర్చుచేసి.. మిగతావన్నీ రకరకాల పేర్లతో దండుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉదంతం కళ్ళ ముందు కనిపిస్తోంది. హర్యాన ఆర్థిక ఇబ్బందులు సజీవ సాక్షాత్కారం లాగా నిలుస్తోంది. అయినప్పటికీ మిగతా రాష్ట్రాల నేతలు మారడం లేదు. అందువల్లే మన దేశం ఆర్థికంగా ఎదలేక పోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 2023-24 కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో సంచలనం సృష్టిస్తోంది.. అందులో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన వివరాలు కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రచారం కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చు చేయడం.. అవి కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేసే బ్యాచ్ కోసం తగలబెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ జీవో లో రీల్స్ కోసం 15 కోట్లు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం.. వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా ప్రచార పిచ్చి ఉంటుంది. ఇందులో కాదనడానికి లేదు. కానీ సోషల్ మీడియాలో రీల్స్ బ్యాచ్ కోసం 15 కోట్లు ఖర్చు చేయడమే సంచలనంగా మారింది. ఈ జీవోలో రీల్స్ కోసమని ప్రత్యేకంగా చెప్పనప్పటికీ.. ఆ డబ్బు మొత్తం అందుకోసమేనని.. నాడు ఈ వ్యవహారం వెనుక “కొ. ది” అనే పేరున్న వ్యక్తి చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది..

కాంగ్రెస్ విమర్శలు

నాటి ప్రభుత్వం ప్రచారం కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ” అప్పటి షాడో ముఖ్యమంత్రికి ఓ వ్యక్తి అత్యంత దగ్గరగా ఉండేవాడు. ఆయన డిజిటల్ మీడియాను పర్యవేక్షించేవాడు. దానిని పూర్తిగా భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేసే విభాగంగా మార్చాడు. దీంతో అందులో అతడు ఇష్టారాజ్యం సాగిపోయింది. పైగా సోషల్ మీడియాలో రీల్స్ చేసే వ్యక్తులకు 30 సెకండ్లకు లక్ష చొప్పున ఇచ్చి.. ఆ పని పూర్తి చేయించారు. ఇందుకోసం ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టారు. నాటి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నే ఇందుకు సాక్ష్యం. మొత్తంగా చూస్తే ప్లాగ్ షిప్ పథకాల ప్రచారమని చెప్పి ఇలా ప్రభుత్వ డబ్బులు అడ్డగోలుగా ఖర్చు చేశారు. ఇది శాంపిల్ మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి మా మీద విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు అన్ని గుర్తుకే ఉన్నాయి. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. పార్లమెంట్లో సున్నా ఇచ్చారు. అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు మా మీద విమర్శలు చేస్తున్నారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. మళ్లీ కర్రుకాల్చి వాత పెడతారని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే నాటి ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా పోస్ట్ చేస్తున్నారు. అయితే దీనిపై నాడు అధికారంలో ఉన్న పార్టీ ఇంతవరకు స్పందించకపోవడం విశేషం.