Swami Swarupananda : జగన్ రాజ గురువుకు కష్టాలు మొదలయ్యాయి. గత ఐదేళ్ల వైసిపి పాలనలో విశాఖ శారదా పీఠానికి ఎంతో ప్రాధాన్యం దక్కింది. దానికి కారణం స్వామి స్వరూపానంద. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయ్యారు ఈ స్వామీజీ. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వామీజీని ఆశ్రయించడంతో ఎనలేని ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. జగన్ సీఎం అయిన తర్వాత మూడు నాలుగు సార్లు ఈ పీఠానికి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.వైసిపి మంత్రులతో పాటు కీలక నేతలు సైతం ఆశ్రమానికి నిత్యం టచ్ లో ఉండేవారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగింది ఈ ఆశ్రమం. అలాంటిది ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే ఈ ఆశ్రమానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. తాజాగా ఆశ్రమానికి ఏపీ రెవెన్యూ శాఖ షాక్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో 15 లక్షల రూపాయలకే 15 ఎకరాలు శారదా పీఠానికి కేటాయించారు. అప్పట్లోదీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే జగన్ సర్కార్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. భూములు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎక్కడ లక్ష రూపాయలకే ఎందుకు కేటాయించారో విచారణ చేపట్టాలని ఆదేశించింది. రెవెన్యూ అధికారుల నివేదికతో వెంటనే భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి ఎండార్స్ చేశారు.
* అనధికార పాలనా కేంద్రంగా
వైసిపి హయాంలో విశాఖ శారదా పీఠం ఒక అనధికార పాలన కేంద్రంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామీజీ ఆదేశాలతోనే ఎన్నో రకాల మార్పులు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే జగన్ సర్కార్ లెక్క చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం యాగాలు చేశారు స్వామీజీ. రాజకీయ మిత్రుడు కేసీఆర్ సలహాతో ఆ స్వామీజీని ఆశ్రయించారు జగన్. అప్పటినుంచి స్వామీజీకి భక్తుడిగా మారిపోయారు. స్వామీజీ యాగ ఫలితాల వల్లే తాను అధికారంలోకి వచ్చానని జగన్ భావించారు. అందుకే స్వామీజీ అడిగిందే తడవుగా 15 ఎకరాల భూమిని 15 లక్షలకు అందించారు. బహిరంగ మార్కెట్లో ఆ భూమి ధర 250 కోట్ల రూపాయల పై మాటే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం అయ్యింది.
* ఆ దరఖాస్తు పెండింగ్
ఈ ఎన్నికలకు ముందు స్వరూపానంద జగన్ సర్కార్ కు ఒక విన్నపం చేసుకున్నారు. తనకు కేటాయించిన 15 ఎకరాలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి జగన్ సర్కార్ అనుకూలంగా స్పందించింది. కానీ ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. స్వామీజీ పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్లో పడింది. అయితే వచ్చేది వైసిపి ప్రభుత్వం కనుక.. తమకు ఇబ్బందులు ఉండవని పీఠం వర్గాలు భావించాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములపై దృష్టి పెట్టింది. తిరిగి స్వాధీనం చేసుకోవడంతో శారదా పీఠానికి ఝలక్ తగిలినట్లు అయ్యింది.