కరోనా మహమ్మారి ని ఎదుర్కోవటంలో కేరళ ప్రభుత్వం బాగా పనిచేసిందని భారత ప్రభుత్వం తో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా కితాబిచ్చాయి. కేరళ ముఖ్యమంత్రి , ఆరోగ్యశాఖ మంత్రి కి ఈ సందర్భంగా మంచిపేరొచ్చింది. దీనితో కేరళ వామపక్ష ప్రభుత్వానికి డోకాలేదని ఈసారి సంప్రదాయానికి భిన్నంగా వచ్చే ఎన్నికల్లోనూ వామపక్ష ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని డంకా బజాయించి చెప్పారు పరిశీలకులు. రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మొత్తం సీన్ మారింది. ఎక్కడ కదిలించినా దొంగ బంగారం కేసే అందరి నోళ్ళలో నానుతుంది. మామూలుగా అయితే అది ఎప్పటిలాగే పేపర్లలో ఒక వార్తలాగా వుండేది. కానీ దాని మూలాలు ముఖ్యమంత్రి కార్యాలయం లో ఉండటంతో ఇది సంచలన వార్త అయ్యింది.
కేరళ లో యు ఎ ఇ దౌత్య కార్యాలయం వుంది. గల్ఫ్ దేశాల్లో మలయాళీలు చాలా ఎక్కువమంది పనిచేస్తున్నారు. దానివలన కేరళ కి వచ్చే విదేశీ నిధులు కూడా పెద్ద మొత్తం లోనే వున్నాయి. అందుకే అక్కడ యు ఎ ఇ దౌత్య కార్యాలయం పెట్టింది. అంతవరకూ బాగానే వుంది. కాకపోతే ఇప్పుడు ఈ పేరు దొంగ బంగారం తో ముడి పడింది. సహజంగా దౌత్య వర్గాలకు సంబందించిన కార్గో బ్యాగేజి కస్టమ్స్ అధికారులు చెక్ చేయరు. చేయాలంటే వాళ్ళ అనుమతితోనే చేస్తారు. ఈ సదుపాయాన్ని అంతకుముందు అందులో పనిచేసిన స్వప్న సురేష్ చాలా తెలివిగా వుపయోగించుకుంది. అంతకుముందు తను అందులో పనిచేయటంతో దౌత్య మార్గాల్లో కస్టమ్స్ తనిఖీ ఉండదని తెలియటంతో దాన్నే ఇప్పుడు తెలివిగా తన దొంగ బంగారం తరలించటానికి వాడుకుంది. స్వప్న సురేష్ చాలా తెలివైన, చురుకైన అమ్మాయి. ఎక్కడపనిచేసినా అక్కడ అధికారులతో చనువు పెంచుకోగలదు. మొదట్లో విమానాశ్రయం లో పనిచేసినా , తర్వాత యు ఎ ఇ దౌత్య కార్యాలయంలో పనిచేసినా, ఆ తర్వాత కేరళ ప్రభుత్వం లో పని సంపాదించినా తన తెలివితేటలు, మాటకారితనంతో సాధించుకోగలిగింది. ఆవిడ స్పేస్ పార్క్ లో వుద్యోగం కేరళ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శివశంకర్ ద్వారానే సంపాదించిందంటే తన పలుకుబడిని అర్ధం చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాల్లో సిపిఎం నాయకులు, ఎమ్యెల్యేలు, మంత్రులతో పరిచయాలు పెంచుకోగలిగింది. ఆ సంబంధాలే ఇప్పుడు ఉపయోగపడ్డాయి.
మలయాళీ సినిమా యాక్టర్లు దుబాయ్ వెళ్లి వచ్చేటప్పుడు వాళ్ళతో ఈ దొంగ బంగారం పంపించటం చాలా రోజులనుంచి జరుగుతుంది. ఎవరైనా పట్టుకుంటే స్వప్న సురేష్ తనకున్న రాజకీయ పలుకుబడితో విడిపించేది. సిపిఎం నాయకులతో, ముఖ్యమంత్రి కార్యాలయం తో ఏర్పడిన సంబంధాలు తెలివిగా ఉపయోగించటం మొదలుపెట్టింది. ఇది ఇటీవల ఓ గ్యాంగ్ సినిమా యాక్టర్ ని బెదిరించటం తో ఆ కేసుని విచారిస్తుంటే ఈ దొంగ బంగారం వ్యవహారం బయటపడింది. కొచ్చి పోలీసులు కేసుని కస్టమ్స్ శాఖకు తెలిపారు. అది మెల్లి మెల్లిగా ముఖ్యమంత్రి కార్యాలయం దాకా లింకులు ఉండటంతో సంచలన మయ్యింది. చివరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటం కోసం ముఖ్యమంత్రి పిన్నరాయి విజయన్ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ని తప్పించటం జరిగింది. అయినా అప్పటికే జరగాల్సిన డామేజి జరిగిపోయింది. స్వప్న సురేష్ కాల్ రికార్డు లో ఎంతోమంది మంత్రులు, సిపిఎం నాయకులు, అధికారులు ఉండటంతో ఈ మకిలీ వ్యవహారం లో ప్రభుత్వం, సిపిఎం పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. ప్రతిపక్ష పార్టీలు పిన్నరాయి విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనివెనక ఇంకా ఎంతమంది వున్నారోనని జనం అనుకుంటున్నారు. ప్రజల ఒత్తిడి మేరకు కేసు దర్యాప్తు కోసం కేంద్రానికి రాయటం , కేంద్రం కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించటం చక చకా జరిగిపోయాయి. ఒక్క పదిరోజుల్లో కేరళ రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మంచి గుడ్ విల్ లో వున్న ప్రభుత్వం ఒక్కసారి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి మారిపోయింది. ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యు డి ఎఫ్ కి ఏ మేరకు లాభిస్తుందో చూడాలి.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Kerala cpm government in deep trouble
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com