https://oktelugu.com/

TS TET 2024: టెట్ ను అసలు పట్టించుకునే వారే లేరుగా.. ఎందుకిలా?

దరఖాస్తులు తక్కువగా రావడంతో విద్యాశాఖ అధికారులు గడువును మరో పది రోజులు పెంచాలని నిర్ణయించారు. ఈమేరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఏప్రిల్‌ 10(బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 10, 2024 / 05:15 PM IST

    TS TET 2024

    Follow us on

    TS TET 2024: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. వచ్చేనెల 20 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 10తో మిగియనుండగా, 9వ తేదీ నాటికి కేవలం 1.93 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. బుధవారం సాయంత్రం వరకు గడువు ఉంది. 2 లక్షలు మించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది సెప్టెంబర్‌లోనిర్వహించిన ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే 90 వేల దరఖాస్తులు తగ్గే అవకాశం ఉంది.

    గడువు పెంపు..
    దరఖాస్తులు తక్కువగా రావడంతో విద్యాశాఖ అధికారులు గడువును మరో పది రోజులు పెంచాలని నిర్ణయించారు. ఈమేరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఏప్రిల్‌ 10(బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 20వ∙తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయినా గతేడాదిలా దరఖాస్తులు రావడం కష్టమే అని పలువురు పేర్కొంటున్నారు.

    2012 నుంచి టెట్‌..
    ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్షను 2012 నుంచి నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన టెట్‌ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015 నుంచి నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్‌ అర్హత సాధించారు. ఉపాధ్యాయ కొలువు ఎంపికలకు నిర్వహించే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా డీఈడీ, బీఈడీ చేసిన వారు, గతంలో టెట్‌లో తక్కువ మార్కులు వచ్చిన వారు మార్కులు పెంచుకునేందుకు టెట్‌ రాస్తున్నారు. ఈసారి మాత్రం అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది.

    అధిక ఫీజు..
    టెట్‌ దరఖాస్తులు తగ్గడానికి అధిక ఫీజు కూడా కారణమని తెలుస్తోంది. గతేడాది వరకు టెట్‌కు రూ.400 మాత్రమే దరఖాస్తు ఫీజు ఉండేది. ఈసారి ఒక్కో పేపర్‌కు రూ.1000 వసూలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

    ఎక్కువగా వస్తాయనుకుంటే..
    వాస్తవానికి ఈసారి టెట్‌కు దరఖాస్తులు ఎక్కువగా వస్తాయని ఆశించారు. సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా టెట్‌ రాయాల్సిందే అని కోర్టు తీర్పు చెప్పింది. టెట్‌ ఉన్నవారికే ప్రమోషన్లు ఇవ్వాలని తెలిపింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ రాసే వారితోపాటు ఉపాధ్యాయులు కూడా దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేశారు. కానీ, గతేడాదికంటే దరఖాస్తులు తగ్గడం గమనార్హం. ఉపాధ్యాయుల తమకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

    డీఎస్సీపైనే దృష్టి..
    ఇక అభ్యర్థులు ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ తరుణంలో టెట్‌కు ప్రిపేర్‌ కావడం కన్నా.. డీఎస్సీకి చదవడమే మేలని చాలా మంది భావిస్తున్నారు. దీంతో టెట్‌కు చాలా మంది దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది.