AP Free Ration: ఏపీలో కేంద్రం అందించే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ గత నాలుగు నెలలుగా నిలిచిపోయింది. బియ్యం లేవన్న కారణం చూపుతూ ఏప్రిల్, మే జూన్ నెలలకు సంబంధించి బియ్యం అందించలేదు. జూలైకు సంబంధించి మూడో వారం దాటుతున్నా అతీగతీ లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అందిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు లబ్ధిదారుల్లో సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు బీజేపీ నాయకులు సైతం దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందించారు. పేదలకు కేంద్రం ఉచిత బియ్యం పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తే ఏపీ ప్రభుత్వం నొక్కేస్తోందని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నా వైసీపీ నేతల నుంచి ఎటువంటి సమాధానం లేదు. అయితే ఒక విధంగా బీజేపీ ఆరోపణలకు వైసీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భయపడుతోంది. కొవిడ్ తో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకుగాను ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2022 మార్చితో ఉచిత పంపిణీ ముగిసినప్పటికీ కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ లెక్కన ఈ ఏడాది అక్టోబరు వరకూ అందించాలి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సక్రమంగా అందించడం లేదు. రకరకాల కొర్రీలు పెడుతూ వస్తోంది.
నాలుగు నెలలుగా అందని బియ్యం..
వైట్ రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి నెలకు 5 కిలోల వంతున పంపిణీ చేయాలి. కేంద్రం ఠంచన్‌గా బియ్యం పంపిణీ చేస్తున్నా నాలుగు నెలలుగా ఏపీ ప్రభుత్వం పేదలకు ఇవ్వడంలేదు. ఏప్రిల్ నెలలో సరిపడా బియ్యం నిల్వలు లేవని, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం తక్కువ కోటా ఇస్తోందని, అందుకే బియ్యం పంపిణీ చేపట్టలేదని వాదిస్తోంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం సన్న బియ్యం పేరిట ఇంటింటా రేషన్ అందిస్తోంది. ప్రతీ నెల తొలి పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ చేయాలి. రెండో పక్షం రోజుల్లో కేంద్రం అందించే ఉచిత బియ్యం అందించాలి.
అయితే బియ్యం పంపిణీకిగాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత మొత్తం నగదు చెల్లిస్తోంది. కానీ సన్నబియ్యం పేరిట నూకలు తీసి ఇస్తున్న బియ్యానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం భారం పడుతోంది. అదే బియ్యం కేంద్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలంటే మరింత భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. పైగా నాన్ షార్టెక్స్ బియ్యం ఉండడం.. సాధారణ బియ్యం నిల్వలు లేకపోవడంతో ఉచిత పథకం అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. అయితే అన్ని రాష్ట్రాల్లో సవ్యంగా ఉచిత బియ్యం అందుతున్నా. ఏపీలో మాత్రం మొండిచేయి చూపుతుండడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఉచిత బియ్యం అందించకుంటే రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణతో పాటు బియ్యం పంపిణీని సైతం నిలిపివేస్తామని హెచ్చరించింది.
స్వరం పెంచిన బీజేపీ
ఈ విషయంలో అధికార వైసీపీని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పేదల బియ్యాన్ని నొక్కేస్తున్నారని సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ప్రధాని మోదీ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం అందిస్తుంటే జగన్ సర్కారు అడ్డుకుంటోందని ఊరూ వాడా ప్రచారం చేస్తోంది. అయితే దీనిపై వైసీపీ ప్రభుత్వం భిన్న వాదనను వినిపిస్తోంది. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డులు కేంద్రం లెక్క కన్నా డబుల్ ఉన్నాయని చెబుతోంది. అందరికీ ఇవ్వకుండా కొందరికే ఇస్తే… మిగతా వారిలో అసంతృప్తి నెలకొంటుందన్నారు. అందరికీ ఇవ్వాలంటే తమకు ఖర్చవుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అందరికీ ఫ్రీ బియ్యం అందించాలంటే కుదరని పనిగా భావిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో అందించి ఇక్కడ మాత్రం మొండిచేయి చూపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. అటు లబ్దిదారులు సైతం ప్రభుత్వం తీరుపై పెదవివిరుస్తున్నారు.
Also Read:Sri Lanka Crisis- India: శ్రీలంక ఆర్థిక దుస్థితినుంచి గట్టెక్కించే భారత్ ‘రూపాయి’ ప్లాన్
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Is there no free ration this month the center is angry with the jagan government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com