
మనిషి ప్రాణానికి విలువ కట్టలేము. ఎంత మొత్తంలో డబ్బు ఇచ్చినా పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము. వైసీపీ నాయకుల తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. విశాఖ దుర్ఘటనలో మరనించిన వారి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా గురించి పొగుడుకునే క్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక న్యూస్ ఛానల్ లో జరిగిన చర్చలో ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన కోటి ఎక్స్‌గ్రేషియా చూసి.. అయ్యో, మేం చచ్చిపోయినా బావుండేది.. మా కుటుంబాలకు కోటి రూపాయలు వచ్చేది..’ అనుకుంటున్నారంటూ చెప్పారు. ఆ ఎమ్మెల్యే ఎవరంటే విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గ శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ. ఈ విషయంలో ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘రూ.20 లక్షలు ఎక్కువ వాళ్ళకి.. అలాంటిది మా ముఖ్యమంత్రి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు’ అని మంత్రి వ్యాఖ్యలు చేశారు.
ఈ దుర్ఘటన లో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ప్రకటించిన ఎక్స్ గ్రేషియా మెరుగ్గానే ఉన్నా దీనివల్ల వచ్చేమంచి కంటే, ఆ పార్టీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వం అపఖ్యాతి పాలవుతుంది. మాకు డబ్బు కాదు మా కుటుంబ సభ్యులను తెచ్చి ఇవ్వండి అంటూ బాధితుల రోధన అందరినీ ఉద్విగ్నతకు గురి చేస్తోంది. ఆరేళ్ళ చిన్నారిని కోల్పోయిన తల్లి గుండెకోత ఎంత ఇస్తే తీరుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.