BRS- YCP: ‘కర్ర విరగకూడదు..పాము చావకూడదు’ అన్నట్టుంది ఏపీలో వైసీపీ పరిస్థితి. తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పై ఎలా స్పందించాలో తెలియడం లేదు. అంతర్గతంగా కేసీఆర్, జగన్ ల మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. కానీ బయటకు కలవలేని పరిస్థితి. బీజేపీ రూపంలో అజేయమైన శక్తి ఇప్పుడు వైసీపీకి అడ్డంకిగా మారింది. బీజేపీకి కాదని కేసీఆర్ బీఆర్ఎస్ ను ఆహ్వానిస్తే ఎదురయ్యే పరిణామాలు తెలుసు కనుక వైసీపీ నేతలు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా రాజకీయ విమర్శలు చేసినా.. అవి సుతిమెత్తగా ఉన్నాయని.. వారి మధ్య మైత్రిని తెలియజెప్పాయని విశ్లేషకులు చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా తన బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో పడ్డారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మంలో గ్రాండ్ గా సభను నిర్వహించగలిగారు. పనిలో పనిగా ఏపీ నుంచి కూడా జన సమీకరణ చేశారు. భారీగా జనాలను తరలించగలిగారు. బీఆర్ఎస్ సభకు ఏపీఎస్ ఆర్టీసీ సైతం సేవలందించింది. సుమారు 150 బస్సులను సర్దుబాటు చేసింది. సరిహద్దు జిల్లాల నుంచి జనాలు తరలించేందుకు సహకరించింది. ఏపీలో విపక్ష నేతల సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు అడిగితే ససేమిరా అనే ప్రజా రవాణా శాఖ బీఆర్ఎస్ సభకు మాత్రం అనుమతివ్వడం హాట్ టాపిక్ గా మారింది. అటు సభలో కేసీఆర్ ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. 2024 తరువాత ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వెళ్లడం ఖాయమని కేసీఆర్ ప్రకటించారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ తేల్చిచెప్పారు. కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా అన్నిరంగాల వారు బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. అయితే కేసీఆర్ కామెంట్స్ పై తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీలు రియాక్టయ్యాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు కేసీఆర్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముందు తెలంగాణలో గెలిచి.. తరువాత జాతీయ స్థాయిలో చూసుకోవాలి అంటూ సవాల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ఏపీలో మాత్రం ఏ రాజకీయ పార్టీ పెద్దగా స్పందించలేదు. కానీ వైసీపీ నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యపరుస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అసలు కేసీఆర్ బీఆర్ఎస్ కు అంత సీన్ లేదన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలను మార్చే సత్తా లేదని.. ఆ పరిస్థితి కూడా ఇప్పుడు లేదని చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ ను దాటుకుని వెళ్లేపరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలు మాట్లాడారు కాబట్టి .. బీజేపీకి నేరుగా అనుకూలంగా మాట్లాడకుండా నాని ఖండనకే పరిమితమయ్యారు. కేసీఆర్ తో ఉన్న బంధాన్ని గుర్తుచేసేలా సుతిమెత్తగా.. బీజేపీకి మేము వ్యతిరేకం కాదు అనే అర్ధం వచ్చేలా పేర్ని నాని మాట్లాడం విశేషం.