YSR Veterinary Ambulance Services: ప్రారంభించి పదిరోజులైనా కాలేదు ఏపీలో వైఎస్సార్ పశువైద్య సంచార వాహనాల సేవలు నిలిచిపోయాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 వాహనాలకు సీఎం జగన్ ఆర్భాటంగా జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. చాలీచాలని వేతనాలిస్తున్నారని డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది సమ్మె బాట పట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. అయతే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కఠువుగా వ్యవహరిస్తోంది. జీతాల గురించి డాక్టర్లు ప్రశ్నించడంతో వాహనాలను నిర్వహిస్తున్న సంస్థ తాజాగా 15 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో అంబులెన్స్‌లను ప్రారంభించిన 15 రోజుల్లోపే పశువైద్యులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. రైతుల ఇళ్ల వద్దే పశువులకు వైద్య సేవలు అందించడం కోసం తీసుకున్న 175 మంది డాక్టర్లలో 90 మంది దాకా ఏపీకి చెందిన వారు ఉన్నారు. మిగతా వారు పక్కా రాష్ట్రాలకు చెందిన వారు. రాష్ట్రానికి చెందిన వైద్యులు జీతాలపై నిలదీశారు. తమ విధుల్లోనూ ప్రభుత్వం ముందు చెప్పినదానికి, ఇప్పుడు చేయిస్తున్న పనులకు పొంతన లేదనిసిబ్బంది చెబుతున్నారు. దీంతో ఈ పథకం అటకెక్కటం ఖాయమని పశువైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ సంచార వాహనాల్లో డాక్టర్లకు రూ.40వేలు, సహాయకులకు రూ.17,500, డ్రైవర్ కమ్ అటెండర్లకు అలవెన్స్‌లతో కలిపి రూ.13,300గా నిర్ణయించారు.
వారితో పోల్చుకుంటే..
వాస్తవంగా ప్రైవేటుగా పౌల్ర్టీ, హేచరీ్‌సలో పని చేసే పశువైద్యులకు రూ.35వేలకు పైగా ఇస్తున్నారు. ఇంకా బయట సేవలకు అదనంగా సంపాదించుకునే వీలుంది. ప్రభుత్వం రెగ్యులర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు జీతభత్యాలన్నీ కలిపి రూ.60వేలకు పైగా చెల్లిస్తోంది. దీంతో తమకు కూడా అంతే వేతనం ఇవ్వాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan- Nagababu: అమరావతిలో పవన్ కళ్యాణ్.. ఉత్తరాంధ్రలో నాగబాబు.. అసలు టార్గెట్ ఏంటి?
ప్రభుత్వ రంగంలోని సంచార పశువైద్య క్లినిక్‌లలో పని చేసే తమకు తక్కువ ఇవ్వడం సరికాదంటూ డాక్టర్లు గత వారం నిరసన వ్యక్తం చేసి, సమ్మె చేపట్టారు. డాక్టర్లు, సిబ్బంది ఆందోళన చేపట్టడం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ప్రశ్నించిన వారిపై చర్యలకు హుకుం జారీ చేశారని సమాచారం. ఈ కారణంగా సంస్థ 15 మంది డాక్టర్లకు ఉద్వాసన పలికింది. దీంతో పారా మెడికల్ సిబ్బంది తిరిగి విధుల్లో చేరుతున్నారు. కానీ కొంత మంది డాక్టర్లు మాత్రం జీతాలు పెంచాల్సిందేనని పట్టు బడుతున్నారు.
అదనంగా ఆర్బీకే సేవలు
సంచార పశువైద్య సిబ్బందికి ఆర్బీకేల్లో పనులు అప్పజెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్స్ రానప్పుడు ఆర్బీకేల్లో పశువులకు వైద్యం చేయాలంటూ పశుసంవర్థక శాఖ నిర్దేశించింది. దీనిపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంచార వాహనాల సిబ్బందికి వచ్చే ఫోన్ కాల్స్‌ను ఎల్1, ఎల్2, ఎల్3గా విభిజించారు. ఎల్1కు మాత్రమే తక్షణం స్పందించి వ్యాధితో ఇబ్బంది పడుతున్న పశువు ఉన్న చోటకు వెళ్లి వైద్యం చేయాలి. ఎల్2, ఎల్3 కేసుల విషయంలో కాస్త ఆలస్యమైనా, మరుసటి రోజు వెళ్లినా పర్వాలేదనే భావన అధికారులు వ్యక్తం చేశారు. గ్రామాలకు వెళ్లని పరిస్థితుల్లో ఆర్బీకేలకు వచ్చే పశువులకు వైద్యం చేయాలనడం కష్టంగా అనిపిస్తోందని సిబ్బంది చెబుతున్నారు.
Also Read:CM Jagan Delhi Tour: మళ్లీ ఢిల్లీకి జగన్.. అసలు కథేంటి?