
ఓవైపు సంక్షేమం, అభివృద్ధి జగన్ పాలనలో బిజీగా ఉంటే.. ఆయనకు చిక్కుల మాత్రం తప్పడం లేదు. ఓవైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జాతీయ స్థాయిలో సీఎం జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఎత్తుగడతో ముందుకెళుతున్నాడు. కేంద్రమంత్రులు, ఇతరులను కలుస్తూ జగన్ పై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు.
మరోవైపు ఏపీ సీఎం జగన్ చెల్లెలు, హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి సైతం జగన్ ను ఇరుకునపెడుతున్నారు. అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో ఆమె వైఎస్ వివేకా హంతుకులను ఇంకా అరెస్ట్ చేయలేదని పోరాడుతున్నారు. కోర్టుకు లేఖలు రాస్తున్నారు. పిటీషన్లు వేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ అధికారంలో ఉండడంతో ఈ పరిణామం ఆయన ప్రత్యర్థులకు వరంగా మారింది. స్వయంగా సీఎం జగన్ బాబాయ్ హత్య జరగడం.. ఆయన చెల్లెలు ఈ పోరుబాట పట్టడంతో జగన్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
తాజాగా వైఎస్ వివేకానందారెడ్డి హత్యకు సంబంధించి ఆయన కూతురు వైఎస్ సునీత మరో స్టెప్ వేయడం జగన్ సర్కార్ కు ఇరుకునపెట్టినట్టైంది. వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణ కొనసాగుతోన్న నేపథ్యంలో ఆయన కుమార్తె కడప ఎస్పీని కలవడం సంచలనమైంది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని వైఎస్ వివేకా కుమార్తె పోలీసులను ఆశ్రయించారు.
సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకనందారెడ్డి (68) గత ఎన్నికల ముందు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం విశేషం. వివేకా కుమార్తె డాక్టర్ సునీత కడప జిల్లా ఎస్పీని మంగళవారం కలిసి పులివెందులలో తనకు భద్ర కల్పించాలని కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ముప్పు ఉందని భావిస్తున్నామని పోలీసులకు తెలిపారు. తన ఇంటి వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజాగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను జోరుపెంచింది. హత్య కేసులో అనుమానితులందరినీ బయటకు లాగుతోంది. సీబీఐకి చెందిన ఓ బృందం కడపలోనే మకాం వేసి అనుమానితులను ప్రశ్నిస్తూ కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ సునీత పోలీసులను రక్షణ కోసం దరఖాస్తు చేయడం.. ఏపీలో జగన్ అధికారంలో ఉండడం చర్చనీయాంశమవుతోంది.