
YS Viveka Murder Case- MP Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పిటీషన్ ను కొట్టివేస్తూ శుక్రవారం కోర్టు ఆదేశాలిచ్చింది. విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చేసింది. దర్యాప్తును నిరాటంకంగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. సీబీఐకు పూర్తిస్థాయిలో అనుమతులు ఇచ్చింది. విచారణను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణ ప్రదేశానికి తన న్యాయమూర్తిని ప్రవేశం కల్పించాలన్న మధ్యంతర పిటీషన్ ను సైతం కొట్టివేసింది. దీంతో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావడం అనివార్యంగా మారింది.
సీబీఐ ఇప్పటివరకూ రిమాండ్ రిపోర్టులు, కౌంటర్ల ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డినే ప్రధాన నిందితుడిగా పేర్కొంది. అటు వివేకా కుమార్తె సునీత ఎంపీ టిక్కెట్ కోసమే తన తండ్రిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డే అసలు సూత్రధారి అని ఆరోపిస్తూ ఆమె హైకోర్టులో ఇంప్లిడ్ పిటీషన్ దాఖలు చేశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు కీలక నిందితులకు డబ్బులు చేరాయని తెలిపారు. వివేకా హత్యకు ముందు అవినాష్ ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నాడని పేర్కొన్నారు. అయితే సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డి అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగింది. అందుకే ముందస్తు జాగ్రత్తగా తనపై కఠిన చర్యలకు దిగకుండా సీబీఐ కు ఆదేశాలివ్వాలని,, విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ ల భయంతోనే గురువారం ఆయన విచారణకు హాజరుకాలేదు. హాజరుకాలేనని ముందస్తు సమాచారమిచ్చారు. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్మకంగా ఉన్నారు. కానీ పిటీషన్లు రద్దుచేస్తూ కోర్టు స్టేలు ఇవ్వలేమని చెప్పింది. పైగా విచారణను కొనసాగించాలని ఆదేశించడంతో దాదాపు అవినాష్ రెడ్డికి దారులు మూసుకుపోయాయి.

అయితే ఏకంగా దర్యాప్తు అధికారిపైనే అవినాష్ రెడ్డి పిటీషన్ వేయడం సంచలనంగా మారింది. పలానా కోణంలో చేయడం లేదని పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే వీటిని పరిగణలోకి తీసుకోని కోర్టు పిటీషన్లను కొట్టివేయడంతో అరెస్ట్ లు కొనసాగుతాయన్న టాక్ ప్రారంభమైంది. మరోవైపు వివేకా కుమార్తె తన తండ్రి హత్యకేసులో ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని కోరుతూ వస్తున్నారు. అన్నివిధాలా పోరాడుతున్నారు. ఇటీవలే ఆమె హైకోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తన తండ్రిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కేసుకు అవసరమైన అన్ని వివరాలు అందులో పొందుపరిచారు.
అటు సీబీఐని కట్టడి చేసేందుకు కోర్టు సుముఖత వ్యక్తం చేయకపోవడం.. ఇటు సునీత ఇంప్లిడ్ పిటీషన్ వేసి పట్టుబిగుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. . హత్యకేసులో సహకరించకుండా ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టులో తప్పుడు కేసులు పెడుతున్నాడని.. తనతో పాటు తన భర్త, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నాడని.. అటు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తున్నాడని.. ఏపీ అధికారులు కేసు విచారణలో సహకరించడం లేదని.. తదితర వివరాలతో సునీత సమగ్రంగా ఇంప్లిట్ పిటీషన్ వేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసు విచారణలో త్వరలో సంచలనాలు నమోదయ్యే చాన్స్ కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి భయపడుతున్నట్టు అరెస్ట్ లపర్వం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.