
MLC Kavitha- Supreme Court: ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ వెంటాడుతోంది. ఇన్నాళ్లూ కవితను సాక్షిగానే పిలుస్తుందని అందరూ భావించారు. కానీ, గురువారం ప్రత్యేక కోర్టుకు కవిత కూడా అనుమానితురాలే అని తెలిపింది. ఆమెను అరుణ్‌పిళ్లైతో కలిపి విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈనెల 20న హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈడీ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని శుక్రవారం అత్యవసర పిటీషన్ వేశారు.
24నే విచారణ..
ఇక అత్యవసర పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కవిత తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితకు మళ్లీ నోటీసులు ఇచ్చిందని, ఈనెల 20 విచారణకు వాలని కోరిందని తెలిపారు. ఇప్పటికే ఈనెల 11న విచారణకు కవిత హాజరయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫోన్ లాక్కున్నారని, రాత్రి వరకు విచారణ పేరుతో వేదించారని తెలిపారు. ఈడీ దర్యాప్తుపై విశ్వసనీయత లేదని వెల్లడించారు. దీనికి స్పందించిన ధర్మాసనం, ఇప్పటికే పటిషన్ వేశారు కదా, 24న విచారణ చేస్తామని చెప్పాము కదా అని వ్యాఖ్యానించింది. అయితే 20న మళ్లీ ఈడీ రావాలని కోరినందున విచారణ 20కి ముందే జరపాలని కవిత తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. కవిత వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.

20న హాజరుపై ఉత్కంఠ..
సుప్రీంలో వేసిన అత్యవసర పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఇప్పుడు కవిత ఈనెల 20న ఏం చేయబోతుందని అన్న టెన్షన్ నెలకొంది. విచారణకు ఈడీ కార్యాలయానికి వెళ్తారా లేక మరేదైనా కారణం చెప్పి విచారణ నుంచి తప్పించుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. ఈనెల 16న నోటీసులోని లోపాన్ని ఎత్తి చూపి విచారణకు గైర్హాజరైన కవిత, సుప్రీం తీర్పు తర్వాతే విచారణకు వస్తానని లేఖ కూడా పంపింది. తాజాగా సుప్రీం కవిత పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో ఇక మరోమారు తన న్యాయనిపుణులతో తప్పించుకునే ఉపాయాలు చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.