Homeఆంధ్రప్రదేశ్‌YS Viveka case : భాస్కర్ రెడ్డి అరెస్ట్.. అవినాష్ పని ఖతమే.. నెక్స్ట్ ఏం...

YS Viveka case : భాస్కర్ రెడ్డి అరెస్ట్.. అవినాష్ పని ఖతమే.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

YS Viveka case :  వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.. ఆదివారం ఉదయం పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు కేసుకు సంబంధించి వివరాలు సేకరించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరిగి కీలక దశకు చేరుకుంది. కొద్దిరోజుల నుంచి ఈ కేసులో స్పీడ్ పెంచిన సిబిఐ.. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చినట్లు అంతా భావిస్తున్నారు. మొన్నటి వరకు అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించుకుంటుంది అనుకున్న తరుణంలో.. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారుల అరెస్టు చేయడంతో తదుపరి ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

వివేకా హత్య కేసులో కొత్త కోణం బయటకు..

వివేక హత్య కేసులో కొత్తకోణం బయటికి రావడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని, తల్లిని లైంగికంగా వేధించడం వల్లే వివేకాను సునీల్ యాదవ్ హత్య చేశారని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న పిమ్మట తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

భారీగా వచ్చిన సిబిఐ అధికారులు..

ఇక ఆదివారం ఉదయం పులివెందులలో భాస్కర్ రెడ్డి నివాసానికి సిబిఐ అధికారులు భారీ సంఖ్యలో వచ్చారు. కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వారిని అనుమతించ లేదు. ఆ తరువాత భాస్కర రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భాస్కర రెడ్డిని కడపకు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తారని సమాచారం. సిబిఐ అధికారులతో వైయస్ భాస్కర్ రెడ్డి తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. భాస్కరరెడ్డితో పాటుగా ఆయన పీఏను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర రెడ్డి అరెస్ట్ కు సంబంధించి సీబీఐ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉందని చెబుతున్నారు.

ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

భాస్కర్ రెడ్డిపై సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే వైయస్ అవినాష్ రెడ్డి కీలక అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో రిమాండ్ లో ఉన్నాడు ఉదయ్ కుమార్ రెడ్డి. ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది సిబిఐ. ఈ హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి పాత్ర పైన ఆరా తీసింది సిబిఐ. ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి కలిసి ఆధారాలను టాంపర్ చేశారని సిబిఐ రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది. వివేక హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసు అని కూడా సిబిఐ ఆరోపించింది. వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఉదయ్ కుమార్ రెడ్డి.. అవినాష్ రెడ్డి ఇంటికి వచ్చాడని సిబిఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. గూగుల్ టేకౌట్ అవుట్ లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి ఆరోజు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు చూపించింది. వివేకా చనిపోయాడని సమాచారం వచ్చేంతవరకు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు చెబుతోంది సిబిఐ. వివేకానంద రెడ్డి చనిపోయాడని తెలిసిన రెండు నిమిషాల్లో అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలో వివేకా ఇంటికి చేరుకున్నారని సిబిఐ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో ఉదయ్ కుమార్ రెడ్డిని పలుమార్లు విచారించిన వివరాలు చెప్పలేదని పేర్కొన్న సిబిఐ.. విచారణకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ఈలోగా ఆదివారం భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అవినాష్ రెడ్డి పని అయిపోయినట్టే..

ఈ కేసులో కీలక ముద్దాయిగా ముందు నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అనుమానిస్తూ వస్తున్నారు. ఒకానొక దశలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని భావించిన తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, తర్వాత కేసు నెమ్మదించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో కేసు తుది దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఆ తరువాత అరెస్టు అవినాష్ రెడ్డిది కావచ్చని పేర్కొంటున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటుండడంతో అతని పని ఖతం అయినట్లేనని పలువురు పేర్కొంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి పాత్రపైన అనేక అనుమానాలు..

2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులు ముందు జరిగిన ఈ ఘటన అనేక అనుమానాలకు కారణమైంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీ హత్య చేయించిందని అప్పట్లో పెద్ద ఆరోపణలు చేశారు. తనకు చెందిన పత్రికలో చంద్రబాబు నాయుడు పై నెపాన్ని నెడుతూ భారీ కథనాలను వండి వార్చారు. కొద్ది గంటల తర్వాత గుండెపోటుగా సీన్ క్రియేట్ చేశారు. క్రమంగా ఈ కేసు విచారణ ప్రారంభమైన తర్వాత అన్ని వేళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైపు చూపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా తన సోదరుడు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిలో కీలక పాత్ర దా, సూత్రధారిగా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి పాత్ర పైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. గత ఎన్నికల్లో లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి డ్రామా, బాబాయ్ హత్యతో వచ్చిన సింపతిని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించారని, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, నేడో రోపో అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండడంతో.. ఈ కేసు సీఎం జగన్ మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Exit mobile version