
YS Viveka case : వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తరువాత అవినాష్ రెడ్డేనని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నారు. సీబీఐ అధికారులు ఆయన ఇంటికి సైతం వెళ్లినట్టు తెలుస్తోంది. సుప్రీం కోర్టుకు వెళ్లి పట్టుపట్టి సీబీఐ విచారణ అధికారిని మార్చడంలో అవినాష్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కానీ ఆ ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. గత కొద్దిరోజులుగా వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉన్న సీబీఐ ఒక్కసారిగా షాక్ ల మీద షాకులిస్తోంది. అరెస్టులకు ఉపక్రమించడంలో కేసులో ‘కీ’లక అనుమానితుల్లో ఆందోళన ప్రారంభమైంది.
సిట్ మార్చిన కొద్దిరోజులకే..
విచారణ తీరు సరిగ్గా లేదని కొద్దిరోజుల కిందట నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రిం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో జాప్యం జరగడంతో పాటు దర్యాప్తు అధికారి ఉద్దేశపూర్వకంగా విచారణను జాప్యం చేస్తున్నారని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొత్త సిట్ ను నియమించింది. దీంతో ఇక సీబీఐ దూకుడు చర్యలు మందగిస్తాయని అంతా భావించారు. కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను సైతం ఎంపీ అవినాష్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. కేసు నీరుగారిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో సీబీఐ ఏకంగా అరెస్టులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎంపీ అనుచరుడి అరెస్ట్..
ఇటీవల అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గుజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్య జరిగిన నాడు ఆయన అవినాష్ రెడ్డితోనే ఉన్నట్టు గుర్తించారు. ఆ రోజు ఎంపీ అవినాష్ తండ్రి భాస్కరరెడ్డి ఇంట్లోనే ఉదయ్ ఉన్నట్టు గూగుల్ టెక్ ద్వారా గుర్తించారు. వివేకా హత్య జరిగిన నాడు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్ దే యాక్టివ్ రోల్ అని సీబీఐ గుర్తించినట్టు సమాచారం. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజ్ కట్టినట్టు కూడా దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. అందుకే ఉదయ్ ఇచ్చిన సమాచారంతో భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎంపీ అవినాష్ రెడ్డిపై పడింది.
కోర్టుకు తెలిపిన మరుసటి రోజునే..
కేసులో కీలక అరెస్టుల పర్వం ఉంటుందని కొద్దిరోజుల కిందట ప్రచారం జరిగింది. సిట్ ను మార్చడంతో కథ మళ్లీ మొదటికి వచ్చిందని అంతా భావించారు. ఈ నెల 30లోగా కేసు విచారణ పూర్తి చేయాలన్న కోర్టు ఆదేశాలు ఉన్నా.. అది జరిగే పనేనా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే ఇంతలో సీబీఐ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వివేకా హత్య కేసులో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని … మరిన్ని అరెస్టులు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అలా రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించిన ఒక్క రోజులోనే ఇలా ఉదయమే అరెస్టులు చేయడం సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో అసలు నిందితులు ఎవరో చాలా స్పష్టంగా టెక్నికల్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ నిందితులు రకరకాల పిటిషన్లు వేసి.. అనేక రకాల ఆరోపణలు చేస్తూ.. చివరికి దర్యాప్తు సంస్థపైనా పిటిషన్లు వేసి ఒత్తిడి తెచ్చి దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీబీఐ దూకుడుకు ఇదొక కారణంగా తెలుస్తోంది. అందుకే కేసు విచారణలో పట్టుబిగుస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.