YS Sunitha Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రాజకీయ అడుగులు వేస్తున్నారు. గత కొంతకాలంగా తండ్రి హత్య నిందితులకు కఠినంగా శిక్ష పడాలని పోరాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాజకీయ మద్దతు అవసరమని భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు షర్మిల రూపంలో ఆమెకు కొత్త అవకాశం వచ్చింది. షర్మిల పిసిసి పగ్గాలు తీసుకోవడంతో.. తన తండ్రికి ఇష్టమైన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సునీతకు మార్గం సుగమమైంది. కొద్దిరోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జిల్లాల పర్యటన చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆమె కడప చేరుకున్నారు. ఇడుపులపాయలో రాత్రి బస చేశారు. సోమవారం షర్మిలను సునీత కలుసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతకు షర్మిల అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. వివేక హత్య కేసు విషయంలో షర్మిల బాహటంగానే వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే సునీత షర్మిలను బలంగా నమ్ముతున్నారు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా.. అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. షర్మిలకు తోడుగా రాజకీయ పయనం చేయాలని దాదాపు డిసైడ్ అయ్యారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కడప జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
వివేక హత్య కేసులో నిందితులకు జగన్ సహకారం ఉందన్నది బహిరంగ రహస్యం. అదే సమయంలో సునీతకు షర్మిల అండగా నిలిచారు. ఇప్పుడు అదే షర్మిల పిసిసి పగ్గాలు స్వీకరించడంతో.. రాజకీయాల్లోకి స్వేచ్ఛగా అడుగు పెట్టాలని సునీత భావిస్తున్నారు. సునీత లేదా ఆమె తల్లి కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. జగన్ మరోసారి అవినాష్ రెడ్డికి కడప పార్లమెంట్ స్థానం సీటు ఇస్తే మాత్రం సునీత రెడీ అవుతారని తెలుస్తోంది. కడపలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ పెద్దల సమక్షంలో సునీత పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సభ ద్వారా షర్మిల తో పాటు సునీత పోటీలో ఉంటారని సంకేతాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ రానుంది.