YS Sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ముద్దు్దల తనయ వైఎస్.షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏడాది దాటింది. పాదయాత్రను పేటెంట్‌గా మార్చుకున్న వైఎస్సార్ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తెలంగాణలోనూ అదే స్ట్రాటజీతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. రాజన్న బిడ్డను.. తెలంగాణ కోడల్ని.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే నా లక్ష్యం అంటూ పాదయాత్ర మొదలు పెట్టింది. శనివారం నాటికి ఆమె యాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. కానీ అనుకున్నంత మైలేజీ మాత్రం రాలేదు. యాత్రను పట్టించుకుంటున్న నాథుడే లేడు. తన వెంట ఉన్న అనుచరులు.. ముందుగానే ఖర్చు పెట్టి చేస్తున్న జనసమీకరణ తప్ప పట్టుమని పది మంది కూడా పాదయాత్రలో ఉండటం లేదు.

దక్షిణ తెలంగాణలో యాత్ర..
ప్రస్తుతం యాత్ర దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతోంది. వనపర్తి నియోజకవర్గం కొత్తకోట వద్ద 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేషనల్ హైవే దగ్గర వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. ‘వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే’ అంటూ సెంటిమెంట్ డైలాగులు చెప్పారు విజయమ్మ.
148 రోజులు.. 34 నియోజకవర్గాలు..
షర్మిల సాగిస్తోన్న ప్రజా ప్రస్థానం యాత్ర 2000 కిలోమీటర్లకు చేరుకుంది. తెలంగాణలో 148 రోజులుగా సాగుతోన్న పాదయాత్ర 34 నియోజకవర్గాలను చుట్టేసి.. గతేడాది అక్టోబర్ 20న వైఎస్.రాజశేఖరరెడ్డి సెంటిమెంట్ అయిన చేవెళ్ల నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర మొదలు పెట్టారు. మధ్యలో కరోనా కారణంగా ఒకసారి.. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగాం మరోసారి, అమెరికా పర్యటన కారణంగా ఇంకోసారి విరామం ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం,నల్గొండ జిల్లాల మీదేగా యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించింది.. ప్రస్తుతం కొనసాగుతోంది.
ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా..
ప్రజాప్రస్థానం సందర్భంగా షర్మిల.. అధికార పార్టీ టీఆర్‌ఎస్ సర్కార్ మీద నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రతీ చోట విమర్శలు చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా స్థానిక సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ వస్తున్నారు. మండుటెండలను, జోరు వానలను కూడా లెక్కచేయకుండా పాదయాత్రను సాగిస్తున్నారు. యాత్రతోపాటు ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయా చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలే కాకుండా తాము అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నామనేది కూడా వినిపిస్తున్నారు. తన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ.. తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం తీసుకురావటమే లక్ష్యమని ఉద్ఘాటిస్తున్నారు.

సెంటిమెంట్‌గా పాదయాత్ర..
19 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తరఫున వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతోనే పాదయాత్ర చేశారు. 2003 ఏప్రిల్ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుంచే వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారు. 68 రోజులపాటు అప్పటి ఉమ్మడి జిల్లాల్లోని 56 నియోజకవర్గాల్లో 1,475 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే సెంటిమెంటును ఫాలో అయ్యారు. తెలంగాణ, ఏపీ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి హోదాలో తండ్రి బాటలోనే నడిచారు. 2017, నవంబర్ 6న ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 341 రోజుల్లో 3,648 కిలోమీటర్లు తన పాదయాత్ర సాగించారు. కట్ చేస్తే.. 2019లో వచ్చిన ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదే ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. వైఎస్ షర్మిల సైతం తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టి తండ్రి, సోదరుడి బాటలోనే నడుస్తున్నారు. అటు తండ్రి వైఎస్సార్, ఇటు సోదరుడు జగన్‌కు వర్కవుట్ అయిన.. పాదయాత్ర సెంటిమెంట్ తనకూ కలిసి వస్తుందని షర్మిల భావించింది.
నాడు విస్తృత ప్రచారం.. నేడు అంతంత మాత్రం..
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి షర్మిల సోదరుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేశారు. అదే సమయంలో అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో షర్మిల యాత్రను కొనసాగించేందుకు ముందుకు వచ్చారు. ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఈ డైలాగ్ కూడా యాత్రకు హైలెట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో షర్మిల పాదయాత్రకు మంచి మైలేజీ వచ్చింది. అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. ఏపీలో పోటీచేసిన జగన్ 60 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకున్నారు. కాగా, ఇప్పుడు తెలంగాణలో ఏడాదిగా చేస్తున్న సుదీర్ఘ పాదయాత్రను పట్టించుకునేవారు కనిపించడం లేదు. మీడియాలో హైప్ రావడానికి సీఎం కేసీఆర్‌పైనా ఘాటు భాషను ప్రయోగిస్తున్నారు. పాదయాత్రను పూర్తి చేసి రాజన్న బిడ్డంగా తెలంగాణలో .. రాజన్న రాజ్యం తెచ్చేలా ప్రజల్ని ఒప్పిస్తానని ఆమె నమ్మకంతో ఉన్నారు. కానీ రాజన్న బిడ్డను పట్టించుకునేంత తీరిక తెలంగాణ ప్రజలకు లేకపోయింది.