Krishnam Raju- Kaikala Satyanarayana: తెలుగు తెర పై తన మాటలతో గారడీ చేశారు కృష్ణంరాజు గారు. అందుకే.. ఆ రోజుల్లో డైలాగ్స్ అంటే ఎన్టీఆర్ తర్వాత కృష్ణంరాజు గారే గుర్తుకు వచ్చేవారు. కానీ, “ద్రోహి” సినిమా రిలీజ్ అయిన రోజులు అవి. కృష్ణంరాజు అద్భుతంగా నటిస్తున్నాడు. కానీ, కృష్ణంరాజు డైలాగ్స్ విన్నప్పుడు ఇంత గొప్పగా తెలుగును పలుకుతున్నాడు, డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు ? అంటూ కైకాల సత్యనారాయణ గారికి అనుమానం కలిగింది. సహజంగా కైకాల సత్యనారాయణగారికి ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు.

అలాంటిది కృష్ణంరాజు తెలుగు పలుకుతున్న విధానం కైకాల గారిని కట్టి పడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు కృష్ణంరాజు . కైకాల గారు, తన పక్కన కూర్చున్న అల్లు రామలింగయ్య తో ‘ఏమయ్యా లింగయ్య.. ఆ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరయ్యా ? ఎవరో గానీ, అన్నగారు లాగా బాగా రౌద్రంగా చెబుతున్నాడే.. ఎవరు ?’ అని ఆతృతగా అడిగారు.
అల్లు రామలింగయ్య చిన్న చిరు నవ్వు నవ్వి.. ‘అతనికి డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు. అతనే’ అన్నాడు. కైకాల గారు వెంటనే.. ఓరి.. అతను అంత బాగా చెప్పాడా ? గొప్పగా చెప్పాడే !’ అని ఆశ్చర్యపోయారు. సినిమా అయిపోయాక వెంటనే కైకాల గారు.. కృష్ణంరాజుగారి ఇంటికి వెళ్లి.. ‘ఏమయ్యా ఇంత అద్భుతంగా డైలాగ్ లు చెబుతున్నావ్.. నువ్వు మరిన్నీ చిత్రాల్లో నటించాలి’ అని అంటే.. ఆ మాటకు కృష్ణంరాజు నవ్వుతూ.. ‘అంటే.. ఇప్పుడు నన్ను మీకు కూడా క్యారెక్టర్స్ లేకుండా చేయమంటారా ?’ అంటూ నవ్వేశారు అట.

కైకాల గారు కూడా పెద్దగా నవ్వేసి.. ఆ తర్వాత చాలా రోజులు పాటు ఈ మాటనే తల్చుకుంటూ నవ్వుకున్నారు. అయితే విశేషం ఏమిటంటే.. ఆ తర్వాత కైకాల గారు చేయాల్సిన కొన్ని పాత్రలను కృష్ణంరాజు గారు చేశారు. గొప్పతనం ఏమిటంటే కృష్ణంరాజు గారు కైకాల గారి కంటే ఆ పాత్రలను గొప్పగా చేశారు. అసలు కృష్ణంరాజు గారు విలన్ గా చేసిన పాత్రలను మనం అంత త్వరగా గుర్తు పెట్టలేం.
మనం సినిమా గురించి తెలుసుకున్నప్పుడు తెలుస్తుందే తప్ప చూస్తున్నప్పుడు తెలియదు. అంతగా ఆయన తన విలన్ పాత్రల్లోకి ఒదిగిపోయారు. అసలు ఎస్టాబ్లిష్డ్ విలన్, హీరో.. పైగా గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి.. చాలా సహజంగా నటించడం కృష్ణంరాజు గారికే చెల్లింది. అందుకే, కృష్ణంరాజు గారి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.