
తెలంగాణ రాష్ట్ర వేదికగా మరో పార్టీ ఆవిర్భవించబోతోంది. మరికొద్ది గంటల్లోనే పార్టీ పేరు.. జెండా.. ఎజెండా రాబోతోంది. ఈ సాయంత్రం ఖమ్మం వేదికగా ఆ పార్టీ పురుడు పోసుకోనుంది. తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా కొనసాగుతోంది. అధికారంలో ఉంది. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత.. ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ రాజకీయ పార్టీ ఆవిర్భవించడం ఇదే తొలిసారి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలతో పాటు టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా అది ఎదుగుతుందనే అభిప్రాయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్నాయి.
అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. క్లుప్తంగా వైఎస్సార్టీపీ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఈ పార్టీని నెలకొల్పుతున్నారు. ఈ సాయంత్రం ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన సంకల్ప సభలో పార్టీ పేరును ఆమె అధికారికంగా ప్రకటించనున్నారు. విధివిధానాలు, మార్గదర్శకాలు అదే వేదిక మీద వెల్లడించే అవకాశాలు లేకపోలేదు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో ఈ బహిరంగ సభ ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి ఆమె హైదరాబాద్‌లోని తన లోటస్ పాండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
లోటస్‌పాండ్ నివాసం నుంచి బయలుదేరి వెళ్లడానికి ముందు ఆమె వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. ఆయన నిలువెత్తు చిత్రపటానికి నివాళి అర్పించారు. భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఫొటో దిగారు. అనంతరం కారులో బయలుదేరారు. దారి పొడవునా ఆమెకు వైఎస్సార్ అభిమానులు నీరాజనం పట్టారు. పలుచోట్ల ఆమె తన కారును ఆపి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆమె రిస్ట్ వాచీతో కనిపించారు. నల్లరంగు స్ట్రాప్ ఉన్న ఆ రిస్ట్ వాచీని ఇదివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధరించేవారని తెలుస్తోంది. ఆమె వస్త్రధారణ, ఆహార్యం సైతం మారిపోయింది. మొన్నటిదాకా జిల్లాలవారీగా నిర్వహించిన ఆత్మీయ సమావేశాల సందర్భంగా వస్త్రధారణకు భిన్నంగా కనిపించారు. లేత బంగారు వర్ణం, నీలిరంగు అంచు గల చీరెను ధరించారు. దీన్ని సిరిసిల్ల నేతన్నలు నేసి ఇచ్చినట్లు తెలుస్తోంది.
దారి పొడవునా వైఎస్ షర్మిలకు అభిమానులు దట్టీలు కడుతూ కనిపించారు. వైఎస్సార్ శైలిలో ఆమె అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ర్యాలీ సందర్భంగా పలు వాహనాలు ఆమె వెంట సాగాయి. హయత్ నగర్, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, నాయకన్‌గూడెం మీదుగా వైఎస్ షర్మిల సంకల్ప యాత్ర సాగుతుంది. షెడ్యూల్ ప్రకారం.. లక్డీకాపూల్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మీదుగా హయత్ నగర్ చేరుకుంటారు. హయత్ నగర్‌లో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట మీదుగా ఆమె చివ్వెంలకు చేరుకుంటారు.