YS Sharmila Congress: కాంగ్రెస్ పార్టీలో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం దాదాపుగా ఖాయమైనట్టే.. ఆగస్టు 12 లేదా 13 వ తారీఖున ఈ ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గత వారం రోజులుగా బెంగళూరులో మకాం వేసిన షర్మిల.. డీకే శివకుమార్ నేతృత్వంలో తన రాజకీయ ప్రయాణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. శివ కుమార్ తో గంటలకొద్దీ ఏకాంతంగా రాజకీయ చర్చలు జరుపుతున్నట్టు వినికిడి. ఆయన సూచనలతోనే ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వైఖరి తీసుకోవాలన్న డైలమాలో షర్మిల పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విస్తరింపజేయటంలో ఎదురయ్యే కష్టనష్టాల దృష్ట్యా కాంగ్రెస్ లో చేరాలని ఒక అభిప్రాయానికి వచ్చారు.
కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన
తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచీ షర్మిలకు ప్రతిపాదన రావడంతో ఆమె సానుకూలంగా స్పందించారు. ఏపీలో పార్టీ పునరుజ్జీవం, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదన్న సంకల్పం దృష్ట్యానే కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో షర్మిల ప్రాతినిధ్యాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సహా పలువురు నేతలు వ్యతిరేకించారు. మరోవైపున పార్టీలో ఆమెకు ఇవ్వాల్సిన పొజిషన్, ఇతర అంశాలపైనా అధిష్ఠానం తర్జనభర్జన పడింది. ఈ నేపథ్యంలో చేరిక ప్రక్రియ ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఇవన్నీ క్రమంగా కొలిక్కి వస్తున్నాయని, మరో వారం పది రోజుల్లో కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం, షర్మిల చేరిక లాంఛనమేనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వర్గాల సమాచారం.
పోటీ అక్కడి నుంచే..
పార్టీలో హోదాకు సంబంధించి ఏఐసీసీ కార్యవర్గంలోకి ఆమెను తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. లేనిపక్షంలో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించే అవకాశం ఉందంటున్నా రు. అలాగే తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తానంటూ షర్మిల స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. ఆమెను ఎక్కడి నుంచి పోటీకి దింపాలా అన్నదానిపైనా తర్జనభర్జన నడుస్తోంది. పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ షర్మిల చెబుతుండగా.. సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఇచ్చే హోదా, ఏ సీటు నుంచి పోటీ అన్నదీ తేలిపోగానే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అవుతుందని చెబుతున్నారు.