
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా రాష్ట్రంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల. ఇందులో భాగంగా ఇప్పటికే ఆమె లోటస్‌పాండ్ వేదికగా అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు, వైఎస్సార్ అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించారు. నిన్న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు.
సంకల్ప సభ పేరిట ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో ఆద్యంతం షర్మిల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. కేసీఆర్‌పైనే విమర్శలు చేస్తూ ముందుకు సాగారు. ఇది కాస్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాదు.. రాష్ట్ర పాలనను దుమ్ముదులిపారు.
ఇన్ని రోజులు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసే విషయంలో చాలా మంది వెనక్కి తగ్గారు. ఆయనతో ఎందుకు పెట్టుకోవడం అని అందరూ వెనుకడుగు వేశారు. ఈ తరుణంలో షర్మిల ఖమ్మం వేదికలో సీఎంను టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అంత గొప్పగా నిర్వహించిన సభతో ఇప్పుడు రాష్ట్రంలో ఓ చర్చ నడుస్తోంది. అసలు షర్మిల వైపు ఎవరు వెళ్తారు..? అనే విషయమైన ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నోసార్లు కేసీఆర్‌ను విమర్శించాలని చూశారు. కానీ.. రాష్ట్ర నాయకత్వం వారిని వెనక్కి లాగుతూ వచ్చింది. దీంతో ఇన్నాళ్లు కేసీఆర్‌పై కోపంతో ఉన్నవారంతా ఇప్పుడు షర్మిల వైపు వెళ్లే అవకాశాలు లేకపోవచ్చు. కొంతమంది రెడ్డి సామాజిక వర్గంలో, కమ్మ సామాజిక వర్గంలో దళిత సామాజిక వర్గాల్లో సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం నెలకొంది. ఇప్పుడు వీరంతా షర్మిల వైపు వెళ్లేలా ఉన్నారు. అందుకే.. షర్మిల కూడా కేసీఆర్ వ్యతిరేక వర్గాన్ని చేరదీసే ప్రయత్నమే చేస్తున్నారని సమాచారం. ఇదే అంశం కూడా భవిష్యత్తులో షర్మిల కలిసివచ్చే అవకాశంలాగే కనిపిస్తోంది.