తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో వినూత్న మార్పులకు దిగుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడిప్పుడే పలు కీలక విషయాలు సైతం కేసీఆర్ దృష్టికి వస్తున్నాయి. అందులో ప్రధానంగా మంత్రుల వైఖరి ఒక్కొక్కటిగా ఆయనను కాస్త ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంతో నమ్మకంతో మంత్రి పదవులను అప్పజెప్పితే వారి నియోజకవర్గాల్లో తిరగకుండా.. రాజధానిలోనే మకాం పెట్టినట్లుగా ఆయన దృష్టికి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆ విషయంలో కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.
అటు రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు సైతం మంత్రులను టార్గెట్ చేశాయి. మంత్రుల కారణంగా ప్రభుత్వం మాటలు పడాల్సి వస్తోంది. ఇందుకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి వస్తోంది. అందుకే.. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా మంత్రుల వ్యవహార శైలిపై దృష్టి పెట్టారు. వారి వైఫల్యాలను వివరిస్తూనే.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే అక్కడ మంత్రులను ఇన్‌చార్జిగా పెట్టారు. ఎమ్మెల్యేలు సైతం ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన లీడర్లు సైతం ప్రచారంలో మునిగిపోయారు. సీఎం కేసీఆర్ కూడా ఒకమారు బహిరంగ సభ నిర్వహించారు. కానీ.. మంత్రుల పైన నమ్మకం లేకనో.. లేదా వారి ప్రచారం సరిపోవడం లేదనో.. మరోసారి సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
అయితే.. దీనిపై ఇప్పుడు మంత్రులు అలకబూనినట్లు సమాచారం. తాము ఇంత ప్రచారం చేస్తున్నా.. ఇంత కష్టపడుతున్నా చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ఎందుకు రావాల్సి వస్తోందనే ఆలోచనలో పడిపోయారు. అందుకే సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నా మంత్రులు కనీసం ఆయన దగ్గరకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. నాగార్జునసాగర్‌లో మంత్రులు ప్రచారం చేస్తే పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా.. సరే దీనిని కూడా వాడుకోలేని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారని ఇమేజ్ ఉన్న వాళ్లు కూడా బయటకు రావడం లేదని అంటున్నారు.