YS Sharmila: వైఎస్ షర్మిల దూకుడు పెంచారు.పీసీసీ పగ్గాలు అందుకున్నాక రాష్ట్ర సమస్యలపై గట్టిగానే పోరాడుతున్నారు.ముఖ్యంగా విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రజా పోరాటాలుగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా భావోద్వేగ ప్రకటనలు చేస్తున్నారు. అమరావతి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ కార్యక్రమాలకు ఏఐసీసీ నాయకులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమాలకు సంబంధించి సన్నాహక సమావేశం మంగళగిరిలో గురువారం నిర్వహించారు. షర్మిల ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తాను వ్యక్తిగత కారణాలతో ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని.. అలా అనుకుంటే 2019లో ఇక్కడ పోటీ చేసి ఉండే దానినని గుర్తు చేశారు. గట్టిగా పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదన్నారు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ‘ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ఈ విషయంలో తల్లి లాంటి ఏపీని జగన్ వెన్నుపోటు పొడిచారు. ప్రతిపక్ష నేతగా నిరాహార దీక్షలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్నారు. సీఎం అయ్యాక ఆ పార్టీ నుంచి ఒక్కరైనా రాజీనామా చేశారా? ఒక్కటైనా నిజమైన పోరాటం చేశారా? హోదా మన బిడ్డల హక్కు. దీన్ని ఎంతమంది పట్టించుకున్నారు? అది వచ్చి ఉంటే రాజధాని, పోలవరం మనం కట్టుకోలేమా? మన రాష్ట్రం ఎందుకు తక్కువగా ఉండాలి. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన మాటలతోనే నేను ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టా’ అంటూ షర్మిల ప్రసంగం సాగింది.
షర్మిల తాజా వ్యాఖ్యలతో జగన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి ఏకమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ విభజన హామీలతో ఏపీ ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో వీలైనంతవరకు రాష్ట్ర విభజన హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ విషయంలో జగన్ సర్కార్ను గట్టిగా నిలదీయాలని చూస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికి చాటుకుంటే.. వైసీపీకి ఓటమి ఎదురైతే.. ఎన్నికల అనంతరం ఇదే అంశాలను ప్రాతిపదికగా తీసుకొని పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు షర్మిలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. మున్ముందు షర్మిల విమర్శల డోసు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే షర్మిల భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ కి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తానంటేనే, నా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది – బోరుమని ఏడిసినా షర్మిల అక్క #YSSharmila pic.twitter.com/uO3nwAlPxL
— Yeswanth(యశ్వంత్) (@yeswanth86) March 7, 2024