YS Sharmila: వైఎస్ షర్మిల పయనం ఎటు?తెలంగాణలో పొలిటికల్ జర్నీని ప్రారంభించిన ఆమె యూటర్న్ తీసుకున్నారు. ఎటు కాకుండా పోవడంతో ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారు. తెర వెనుక ఏదో జరిగిందని..లోకేష్ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు.. కానుకలు ఎందుకు పంపిస్తారని? దీని వెనుక మర్మం ఉందని అనుమానాలు ఉన్నాయి.ఇక ఎల్లో మీడియా చేతినిండా పని దొరికింది.షర్మిల జగన్ కొంపముంచుతారని.. అందుకు కంకణం కట్టుకున్నారని తెగ కథనాలు రాసుకొచ్చారు. మొన్న ప్రశాంత్ కిషోర్, నేడు షర్మిల జగన్ ను విడిపోయారని పెద్ద పెద్ద స్టోరీలు ప్రచురించారు. చించి పారేశారు.
ఆంధ్రజ్యోతి అయితే సంబరం చేసుకుంది. ఏకంగా లోకేష్, షర్మిల ఫొటోలను పక్కన పెట్టి ఏదో జరుగుతోంది అన్నట్టు రాసుకొచ్చింది. వైసీపీ శిబిరంలో కలకలం రేగింది అంటూ తెగ హడావిడి చేసింది. లోకేష్ పాదయాత్రకు ముందు.. తరువాత ఆయనలో పరిపక్వత వచ్చిందన్న రేంజ్ లో ఈ రాతలు ఉన్నాయి. అయితే ఇవి రాత రాతలని తీసిపారేయలేం. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాల నేపథ్యంలో రాసుకొచ్చారు. అయితే అంతవరకు పరవాలేకున్నా.. షర్మిల ప్రస్థానమే ఇప్పుడు చర్చగా మారింది. ఆమె ఎక్కడ మొదలుపెట్టారు? ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు? నేల విడిచి సాము చేస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జగనన్న వదిలిన బాణంగా తెరపైకి వచ్చారు. అన్న లేనప్పుడు కష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకున్నారు. వేల కిలోమీటర్లు నడిచారు. పనిలో పనిగా సమైక్యవాణిని వినిపించారు. అన్న అధికారంలోకి రావడంతో తెలంగాణం వినిపిస్తూ కొత్త పార్టీ పెట్టారు. పాదాల మీద యాత్ర చేసి తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు. తెలంగాణ ప్రజలు లైట్ తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తానని చెప్పి.. నా అన్నను జైలులో పెడతారా అని కలబడిన కాంగ్రెస్ పార్టీతో సయోధ్య చేసుకోవాలని చూశారు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. విలీనం ఆగింది. ఆమె మనసు మారింది. కెసిఆర్ కోసం జగనన్న వదిలిన బాణం షర్మిల అని.. అదిగో కాంగ్రెస్ లో విలీనం.. ఇదిగో కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అని కొత్తపల్లవి అందుకున్నారు.
ఇప్పుడు హఠాత్తుగా నాన్న స్నేహితుడు, తమ కుటుంబ ప్రత్యర్థి అయిన నారా వారికి క్రిస్మస్ బహుమతులు పంపారు. కుమారుడు రాజారెడ్డి కమ్మ యువతికి పెళ్లి చేసుకోవడం, లేకుంటే కాంగ్రెస్ పగ్గాలు ఇప్పిస్తారని చంద్రబాబు చెంతకు చేరారా అన్న అనుమానం. ఇప్పుడే ప్రశాంత్ కిషోర్ సైతం చంద్రబాబు శిబిరంలో చేరారు. ఆయన డైరెక్షన్ ఏమైనా ఉందా? జగన్ గూటిలో ఉన్న చిన్నత్త లక్ష్మీపార్వతి తో చంద్రబాబును తిట్టించిన మాదిరిగా షర్మిల అనుప్రయోగిస్తారా? లేకుంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చి.. ఏపీలో అన్నను దెబ్బ కొడతారా?అన్నది చూడాలి. ఏపీలో ప్రారంభమైన షర్మిల రాజకీయం.. ఇప్పుడు అదే రాష్ట్రం వైపు వస్తుండడం యాదృచ్ఛిక మా? ఉద్దేశపూర్వకమా? ఇలా ఎలా చూసుకున్నా ఇదో సరికొత్త రాజకీయమే. ఇది ఎంత దాకా వెళుతుందో చూడాలి మరి.