YS Sharmila: మొన్న రాహుల్ గాంధీ జన్మదినం జరిగింది. కర్ణాటకలో సాధించిన విజయం నేపథ్యంలో ఇక్కడి కాంగ్రెస్ నాయకులు హడావిడి చేశారు. దేశస్థాయిలోనూ గతంలో ఎన్నడు లేని విధంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే ఈ వ్యవహారంలో చాలా ఇంట్రెస్ట్ గా అనిపించిన ఒక ట్వీట్ ఉంది. అది వైయస్ షర్మిల చేసింది. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. వాస్తవానికి రాహుల్ గాంధీకి గతంలో ఎన్నడూ కూడా షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. పైగా తన తండ్రి మరణించిన సందర్భంలో తన కుటుంబం పై కాంగ్రెస్ పార్టీ వేదింపులకు పాల్పడిందని అప్పట్లో షర్మిల ఆరోపించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా రాహుల్ గాంధీ సంబంధించి ఆమె ఎప్పుడూ కూడా ఒక్క మాట మాట్లాడలేదు. కానీ తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం విశేషం.
అయితే షర్మిల లో అనూహ్య మార్పునకు కారణం.. ఆమె తన వైయస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుండడం వల్లే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? మీ పార్టీలో విలీనం చేస్తామంటున్నారు కదా? అని విలేకరులు ప్రశ్నిస్తే.. ” ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశం లేదు. ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహిళ కాబట్టి అక్కడ రాజకీయాలు చేసుకోవాలి. ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయితే కచ్చితంగా మేము ఆమెకు మద్దతు పలుకుతాం.. షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం అయితే తమకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని”అని రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే ఆయన మాటలు ఒక రకంగా ఉంటే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి.
శివ కుమార్ ను కలిసింది
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే షర్మిల ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ను కలిసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపింది. వాస్తవంగా ఈ భేటీలో వారిద్దరు మాత్రమే చాలా సేపు మాట్లాడుకున్నారు. తర్వాత పలుమార్లు శివకుమార్ ను కలిసింది. పలు విషయాల్లో ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు మొత్తం శివకుమార్ చూసుకుంటున్నారని తెలిసింది.. ఎక్కడ ఎవర్ని బరిలో నిలపాలి? ఎవరికి సీట్లు ఇవ్వాలి? కులాల సమీకరణ ఎలా? అనే అంశాల ఆధారంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
వేణుగోపాల్ దృష్టికి..
షర్మిల పార్టీని కూడా తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రతిపాదనను శివకుమార్ కేసీ వేణుగోపాల్ వద్ద ఉంచినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చాకే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు షర్మిల కూడా నియోజకవర్గం లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవల ఆమె నిర్వహించిన పాదయాత్రలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో క్యాంపు కార్యాలయం కూడా నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేకపోయినప్పటికీ ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఏమంటారో
ఈ పరిణామాలపై రేవంత్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదు. షర్మిల రాక తమకు నష్టం చేకూర్చుతుందని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బలం ఉంది. ఎన్నికల్లో ఒంటరిగా భారత రాష్ట్ర సమితిని ఢీ కొనే సత్తా ఉంది. ఇలాంటప్పుడు షర్మిల పార్టీ విలీనం ఎందుకనే ప్రశ్న ఆయన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని, బలమైన నేత వల్లే అది జరుగుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఆలోచన గనుక ఉండి ఉంటే వెంటనే షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ చేయాలని ఆయన కోరుతున్నారు. మరి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.