
నేను జగనన్న బాణాన్ని అన్న గొంతు ఇప్పుడు ఎందుకో ధిక్కార స్వరం వినిపిస్తోంది. అన్నకు అండగా ఉన్న చెల్లి ఎక్కడో అలిగినట్లు అనిపిస్తోంది. రాజన్న రాజ్యం కోసం.. జగనన్న అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేసింది. తండ్రిబాటలో నడిచి పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యింది. నాన్న యాసలో మాట్లాడి రాజన్న బిడ్డ వచ్చిందని అనిపించుకుంది. తెలుగు ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు.. జగన్మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్. షర్మిల..
Also Read: తొలివిడత ఫలితాలు.. ఎవరిగోల వారిది..
షర్మిల పార్టీ ఇప్పుడు ఏపీలోనూ చర్చనీయాంశం అయ్యింది. వైఎస్ జగన్ కు చెందిన మీడియా అసలు ఎలాంటి కవరేజీని షర్మిలకు ఇవ్వలేదు. షర్మిల ఫొటో చూపించడానికి కూడా జగన్ సొంత మీడియా ఇష్టపడలేదు. అయితే జగన్ కు మద్దతుగా నిలిచే ఓ వర్గం మీడియా మొత్తం షర్మిలకు పూర్తిస్థాయిలో కవరేజీ ఇచ్చింది. ఈ పరిణామం ఏమిటో వైసీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. అయితే జగన్ సొంత చెల్లికి కూడా న్యాయం చేయలేదని.. అందుకే ఆమె పార్టీ పెట్టుకుందన్న భావన ప్రజల్లోకి వెళ్తోంది.
ఇప్పటికే అనేక రకాల నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం.. చెప్పిన పని ఒక్కటి కూడా చేయరన్న భావన చెల్లికి అన్నపై ఉండడం… ఈ క్రమంలో షర్మిల వేరే పార్టీ పెట్టడం జగన్ ఇమేజ్ కు డ్యామేజీ అవుతుందని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పార్టీ కార్యకర్తల్లో గందరగోళానికి తెరదించడానికి సజ్జల రామకృష్ణా రెడ్డి తప్పనిసరై మీడియా ముందుకు వచ్చారు. షర్మిల పార్టీకి తమకు ఏం సంబంధం లేదని చెప్పేశారు. అయితే.. తెలంగాణలో వైసీపీ ఉండబోదని తేల్చేశారు. అంటే.. ఇక తెలంగాణలో వైసీపీ అంటే.. షర్మిల పార్టీ అన్నమాట. ఈ విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. కానీ వైసీపీకి ఉన్న పరిమితుల కారణంగా ఆయన చాలా నర్మగర్భంగా మాట్లాడారు.
Also Read: ఏపీలోని ఆ గ్రామంలో ఒక్క ఓటుకు 40 వేల రూపాయలు..?
షర్మిల పార్టీకి తమ నుంచి మంచి సహకారం ఉంటుందని తెలిపారు. జగన్ ఆశీస్సులు ఉంటాయని చెప్పుకొచ్చారు. షర్మిల రాజకీయ పార్టీ తెలంగాణలో ఎంత ప్రభావం చూపిస్తుందో కానీ.. ఏపీలో మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. షర్మిల ఎక్కడా… తన రాజకీయ పార్టీ ప్రచారాల్లో జగన్ పేరు కానీ.. ఫొటో కానీ వాడుకోవడం లేదు. కేవలం వైఎస్సార్ దే వాడుతున్నారు. రాజన్న రాజ్యం జగన్ అమలు చేస్తుంటే.. జగన్ ఫొటో కూడా పెట్టుకోవాలని కదా.. అని వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే షర్మిల పార్టీకి ఇప్పుడే క్లాప్ కొట్టారు. ముందుముందు చాలా షెడ్యూలు జరగాల్సి ఉంది. తదుపరి పరిణామాలను బట్టి ఏపీ, తెలంగాణలో ఆమె పార్టీ బలం ఏమిటో స్పష్టత వస్తుందని అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్