వైఎస్ భారతి.. ఆంధ్ర, తెలంగాణలో ఇప్పుడు ఆమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదేమో. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి. పులివెందులలో శిశువైద్య నిపుణుడు అయిన గంగిరెడ్డి కుమార్తె. బిజినెస్ అడ్మినిస్ర్టేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన భారతి.. మొన్నటి వరకు వ్యాపారంలో, మీడియాలోనూ కొనసాగారు. భారతి సిమెంట్స్‌ను, సాక్షి తెలుగు దినపత్రికను చూశారు. జగన్ సీఎం అయ్యాక వాటి నుంచి తప్పుకొని ఇంటి బాధ్యతలు చూస్తున్నారు. జగన్‌కు చేదోడుగా నిలుస్తున్నారు.
Also Read : జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?
ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై, ఆయన సతీమణి భారతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో జనాలకు చాలా సమస్యలున్నాయని, వారిని జగన్ ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చారు. విద్యార్థులు, మహిళలు, వెనుకబడిన వర్గాల వారికి చాలా చేస్తున్నారని.. రైతులు, చేనేతలు, ఆటో డ్రైవర్లను ఆదుకున్నారన్నారు. జగన్ పుట్టక ముందే ఆయన కుటుంబం ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తోందని అన్నారు. తాను స్వయంగా 15 రోజులు పులివెందుల్లో ఉన్నానని.. అక్కడి జనాలతో మాట్లాడానని తెలిపారు.
పులివెందుల్లో 10 కాలనీలు ఎస్సీ, ఎస్టీలకు ఉండగా.. వారికి స్థలం కొనుగోలు చేసి ఇచ్చి వైఎస్ ఫ్యామిలీ ఇళ్లు కట్టించిందని చెప్పారు. వైఎస్ ఫ్యామిలీ 5 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయించిందన్నారు. వికలాంగులు, మానసిక వికలాంగులకు వైఎస్ భారతి జగన్‌తో కలిసి సొంత డబ్బులతో ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవన్నీ ఎవరైనా చెప్పుకుంటారా.. సోనూసూద్ కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు బెటర్ సేవ చేస్తున్నారు ఎప్పుడైనా ఆమె చెప్పుకున్నారా అంటూ వ్యాఖ్యానించారు.
తాను రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ ఏ పదవి ఆశించలేదన్నారు. ప్రజారాజ్యం సమయంలో కూడా తాను ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎప్పుడూ అడగలేదన్నారు. ఇక ఏపీలో మూడు రాజధానుల విషయంపై స్పందించిన ఆయన.. పరిపాలనా వికేంద్రీకరణ మంచి నిర్ణయమే అన్నారు. అమరావతి రైతులకు కూడా జగన్ న్యాయం చేస్తారన్నారు. ఏపీ సీఎం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని.. రాష్ట్రంలో ప్రాజెక్టుల్ని కూడా త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడం మంచి నిర్ణయం అన్నారు.