YouTuber Manish Kashyap: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. సోషల్ మీడియా అనేది ఒక కృత్రిమమైన ప్రపంచం అని.. అందులో కనిపించే పలకరింపులు.. మాట్లాడే మాటలు.. అన్ని కూడా హైబ్రిడ్ అని. కానీ దానినే నిజమని అనుకుంటే.. వాస్తవ జీవితంలోకి దానిని ఇంప్లిమెంట్ చేసుకుంటే అంతకుమించిన దరిద్రం ఇంకొకటి ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీ నాయకులు సోషల్ మీడియాను బలంగా నమ్ముతున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని అధికారంలోకి రావచ్చని భావిస్తున్నారు. కానీ అది అంత సులువు కాదు. సోషల్ మీడియా ద్వారా అధికారంలోకి రావడం సాధ్యం కాదు.
సోషల్ మీడియా అనేది మనిషి తయారుచేసిన ఊహాతీత ప్రపంచం. అందులో కనిపించేవన్ని విచిత్రంగా ఉంటాయి. ఆశ్చర్యంగా దర్శనమిస్తుంటాయి. వీటిని నిజమనుకుంటే.. అంతకు మించిన పిచ్చి మరొకటి ఉండదు. కాకపోతే నేటి కాలంలో రాజకీయ పార్టీ నాయకులు సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నారు. సోషల్ మీడియాను నమ్ముకుని అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ అది ఎంత పొరపాటో ఈ రాజకీయ నాయకుడికి వాస్తవంలోకి అర్థమైంది. అలాగని ఇతడేమి సోషల్ మీడియా గురించి తెలియనివాడు కాదు.. సోషల్ మీడియా మీద పట్టు లేనివాడు అంతకన్నా కాదు.
అతడి పేరు మనీష్.. ఫేమస్ యూట్యూబర్. అతడిని మొత్తం 96 లక్షల మంది అనుసరిస్తున్నారు. అతని వీడియోలకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది.. పైగా అనర్గళంగా ప్రసంగించడంలో అతడుదిట్ట. అటువంటి మనీష్ బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ తరఫున చన్ పటియా నియోజకవర్గంలో పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ విజయం సాధించారు. మనీష్ వినూత్నంగా ప్రచారం చేసినప్పటికీ జనాలు అంత ఈజీగా అతడిని ఒప్పుకోలేదు. ఇతడికి 37, 172 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ కు 87 వేలకు మించిన ఓట్లు వచ్చాయి. దీంతో అభిషేక్ దారుణమైన ఓటమిని మూట కట్టుకున్నాడు. గతంలో మనీష్ తమిళనాడులో వలస కూలీలపై దాడులు చేసి చంపేస్తున్నారంటూ తప్పుడు వీడియో తీశాడు. ఈ వీడియో యూట్యూబ్లో ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు ఇతడిని తమిళనాడు పోలీసులు అరెస్టు కూడా చేశారు.
వాస్తవానికి సోషల్ మీడియాను ఒక పరిధి వరకే వాడుకోవాలి. జనాలతో సంబంధాలను నాయకులు నిత్యం కొనసాగించాలి. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. అవసరమైతే సమస్యల మీద పోరాడి వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలి. అంతేతప్ప సోషల్ మీడియాని మాత్రమే నమ్ముకుని రాజకీయాలు చేయకూడదు. అలా రాజకీయాలు చేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీని చూస్తే తెలుస్తుంది..