youth create ruckus in karimnagar : రోడ్డెక్కినాక ప్రధాని నరేంద్రమోడీ అయినా సామాన్యుడు అయినా ఒక్కటే నిబంధనలు పాటించకపోతే ఐఏఎస్ ల కార్లకు సైతం ఫైన్లు వేసిన పోలీస్ వ్యవస్థ మనది. అయితే పోలీసులు వారి డ్యూటీని కరెక్ట్ గానే చేస్తున్నారు. కానీ అదే పోలీస్ ఉన్నతాధికారి కుటుంబానికి చెందిన కొడుకును అంటూ ఓ యువకుడు హల్ చల్ చేశాడు.
ఎప్పుడూ రద్దీగా ఉండే కరీంనగర్ కలెక్టరేట్ రోడ్ అదీ. నిత్యం ఏదో ఒక పని మీద ప్రజలు వెళుతుంటారు. జర్నలిస్టులు కూడా అక్కడే ఉంటారు. పక్కనే ప్రెస్ క్లబ్ ఉంటుంది. ఇక ఆందోళనలకు అదే అడ్డా. అంతటి బిజీ రోడ్డుపై యువకులు హెల్మెట్ లేకుండా వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ హెల్మెట్ పెట్టుకోవాలని ఆ యువకులకు సూచించారు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ఇద్దరు యువకులు తమ వాహనాన్ని అదే రోడ్డుపై పెట్టి కానిస్టేబుల్ పై దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా.. తాను సీఐ కుమారుడిని.. నన్నే ఆపుతావా? అంటూ రోడ్డుపై వీరంగం సృష్టించారు. దీన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆ యువకులను ఇద్దరినీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను తరలించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోగా.. తాము సీఐ కొడుకులమంటూ కానిస్టేబుల్ పై ఆ యువకులు దాడికి యత్నించినట్టుగా ఆరోపణలున్నాయి. అయితే కానిస్టేబుల్ యే తమపై దాడికి పాల్పడ్డాడని యువకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
అయితే ఎంత సీఐ కొడుకులైనా సరే వారికి రోడ్డు పై వెళితే హెల్మెట్ పెట్టుకోవాలన్న నిబంధన ఉండదా? సీఐ కొడుకు అయితే ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉంటాయా? ప్రశ్నిస్తే కొట్టేస్తారా? అని స్థానికులు విమర్శిస్తున్నారు. బిడ్డలను ఇలా రోడ్డు మీదకు పంపి సదురు పోలీస్ అధికారి ఇదేనే నేర్పించే సంస్కారం అని తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం సీఐ కొడుకులమంటూ కానిస్టేబుల్ పైనే దాడి చేసిన యువకులు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.