Telangana Election Results 2023: మూడు పదులు దాటని ఆ ముగ్గురు అసెంబ్లీలోకి..

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఆమె వయసు 26 ఏళ్లు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించారు.

Written By: Dharma, Updated On : December 3, 2023 5:13 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: తెలంగాణలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరవుతోంది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు చేరువవుతోంది. అయితే పట్టుమని మూడు పదుల వయసు కూడా లేని ముగ్గురు అనూహ్య విజయాన్ని దక్కించుకున్నారు. ప్రత్యర్థులను మట్టి కరిపించారు. శాసనసభలో అడుగుపెట్టనున్నారు. మెదక్ లో మైనంపల్లి రోహిత్ రావు, పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి, నారాయణపేటలో చిట్టెం పర్నికా రెడ్డి విజయం సాధించారు. అయితే ముగ్గురు విద్యాధికులు కావడం విశేషం.

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఆమె వయసు 26 ఏళ్లు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన ఆమె.. వివాహం అనంతరం అమెరికా వెళ్లిపోయారు. తొలుత ఆమె అత్త ఝాన్సీ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ భారత పౌరసత్వం విషయంలో ఆమె చేసుకున్న దరఖాస్తు ముందుకు కదలకపోవడంతో.. ఆమె పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె స్థానంలో కోడలు యశస్విని పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. ఈయన వయసు 26 సంవత్సరాలు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి పై రోహిత్ గెలిచారు. ఈయన సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు కుమారుడు. వైద్య వృత్తిలో ఉన్నారు. హైదరాబాదులో వైద్యుడిగా ఉంటూనే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. మెదక్ అసెంబ్లీ సీటును రోహిత్ కు కేటాయించాలని కెసిఆర్ పై హనుమంతరావు ఒత్తిడి చేశారు.కెసిఆర్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ అసెంబ్లీ సీటును రోహిత్ కు దక్కేలా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి పై రోహిత్ తొమ్మిది వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.

నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పర్నికా రెడ్డి మంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి పై 7950 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈమె వయసు 30 సంవత్సరాలు. వైద్యురాలుగా పనిచేస్తున్నారు. ఈమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ ఎమ్మెల్యేగా, తండ్రి వెంకటేశ్వర రెడ్డి పిసిసి సభ్యుడిగా పనిచేశారు. 2005లో మావోయిస్టుల కాల్పుల్లో నర్సిరెడ్డి తో పాటు వెంకటేశ్వర రెడ్డి మృతి చెందారు. వారి సేవలను గుర్తించి కాంగ్రెస్ హై కమాండ్ పర్నికా రెడ్డికి సీటు ఇచ్చింది. ఈమె అనూహ్య విజయం దక్కించుకున్నారు. ఈమె తల్లి లక్ష్మి ఐఏఎస్ అధికారిగా ఉండగా.. మాజీ మంత్రి డీకే అరుణ మేనత్త కావడం విశేషం.