Telangana Election Results 2023: కాంగ్రెస్ కు టీడీపీ సపోర్టు.. పవన్ పొలిటికల్ కెరీర్ కు చంద్రబాబు వెన్నుపోటేనా?

ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. అవినీతి కేసుల్లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా పవన్ పరామర్శించారు. నేరుగా జైలు నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేశారు.

Written By: Dharma, Updated On : December 3, 2023 5:31 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తెలుగు రాజకీయాలు స్పష్టంగా వెలుగు చూశాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ వెనుక బీఆర్ఎస్ వైఫల్యాలతో పాటు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది టిడిపి సపోర్ట్. చంద్రబాబు నుంచి ఎటువంటి ప్రకటన రాకున్నా… తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఈ విజయానికి ముమ్మాటికి తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు కారణమన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు జనసేన అధినేత పవన్ వెన్నుపోటుకు గురయ్యారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. అవినీతి కేసుల్లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా పవన్ పరామర్శించారు. నేరుగా జైలు నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేశారు. ఒక మిత్రుడిగా చేయాల్సిందంతా చేశారు. పొత్తు విచ్చిన్నానికి వైసీపీతో పాటు మరికొన్ని శక్తులు ప్రయత్నించినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముంగిట.. ఏపీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టిడిపి తో పొత్తు విషయంలో పవన్ చిత్తశుద్ధితో మాట్లాడారు. ఎక్కడా టిడిపిని తగ్గిస్తూ మాట్లాడలేదు. అయినా సరే తెలంగాణలో టిడిపి శ్రేణులు జనసేన వైపు మొగ్గు చూపకపోవడం దారుణం.

తెలంగాణలో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. గ్రేటర్ లో కూకట్పల్లి తో పాటు ఖమ్మం జిల్లాలో మెజారిటీ స్థానాలను జనసేనకు కేటాయిస్తూ బిజెపి నిర్ణయించింది. అయితే ఈ సీట్ల కేటాయింపు కూడా టిడిపి సహకరిస్తుందన్న ఉద్దేశంతో విడిచిపెట్టినవే. కూకట్ పల్లి లో కమ్మ సామాజిక వర్గంతో పాటు సెటిలర్స్ అధికం. అటు ఖమ్మంలో సైతం కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. వీరంతా జనసేనకు సపోర్ట్ చేస్తారని భావించి బిజెపి అక్కడ సీట్లు కేటాయించింది. ఏపీలో పొత్తు ఉండడంతో తెలుగుదేశం పార్టీ సైతం పరోక్షంగా మద్దతు తెలుపుతుందని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా కమ్మ సామాజిక వర్గం మద్దతు తెలపడం విశేషం. చంద్రబాబు ఎటువంటి ప్రకటన చేయకపోయినా.. టిడిపి శ్రేణులకు మాత్రం అంతర్గతంగా సమాచారం వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే పొత్తులో ఉన్నందున జనసేన పోటీ చేసిన ఆ ఎనిమిది స్థానాలు విషయంలో టిడిపి ఎటువంటి ఆలోచన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం ఆ ఎనిమిది చోట్ల జనసేన అభ్యర్థులకు మద్దతు తెలిపి ఉంటే బాధ్యతగా ఉండేది అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయలేదు. మిత్రపక్షంగా ఉన్న జనసేన పోటీ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మద్దతు తెలపాల్సిన బాధ్యత టిడిపి పై ఉంది. కానీ చంద్రబాబు ఇక్కడే తన ఆలోచనకు పదును పెట్టారు. తెలంగాణలో జనసేనకు దెబ్బ కొడితే.. ఏపీలో సీట్ల పరంగా పార్టీ నుంచి డిమాండ్ ఉండదని భావించారు. అందుకే జనసేన అభ్యర్థులకు టిడిపి నుంచి ఎటువంటి సహకారం అందకుండా చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పవన్ కు వెన్నుపోటు పొడవడంమేనన్న కామెంట్స్ జనసేన నుంచి వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు ఈ తరహా రాజకీయాలు అలవాటేనని.. అందుకే పవన్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అభిమానులు సలహా ఇస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధినేతకు చెప్పేందుకు పార్టీ శ్రేణులు సాహసించలేకపోతున్నారు. వెన్నుపోటు అని తెలిసినా పవన్ నోరు మెదపకపోవడంపై అంతర్మధనం చెందుతున్నారు.