
Yogi Adityanath: ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి.. ఈ సూత్రాన్ని అనుసరించాడు కాబట్టే ఉత్తర ప్రదేశ్ ప్రజలకు యోగి నచ్చాడు.. అందుకే రెండోసారి కూడా అతడికే అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు అక్కడ యోగి 2.0 నడుస్తోంది. అక్కడ పాతుకుపోయిన గూండారాజ్ కాకావికలం అవుతోంది. తన ప్రభుత్వం ఏర్పడిన మొదటి దఫాలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యోగి.. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మరింత ఉదృతం చేశాడు. ఫలితంగా అక్కడ రౌడీమూకలు చెల్లా చెదురవుతున్నాయి. ఇక తాజాగా ప్రయాగ్ రాజ్ లోని ఉమేష్ పాల్ హత్య కేసులో యోగి ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. నిందితుల్లో గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. అంతేకాదు స్పాట్ జస్టిస్ పేరుతో శాంతి భద్రతలకు కలిగించే వారికి హెచ్చరిక జారీ చేస్తుంది.
ప్రయాగ్ రాజ్ లోని ఉమేష్ పాల్ అనే ప్రజా ప్రతినిధి ఇటీవల హత్యకు గురయ్యారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిని రాజకీయంగా వాడుకోవాలని సమాజ్ వాది పార్టీ భావించింది. అఖిలేష్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాడు. దీంతో ఒక్కసారిగా యోగి తన మాస్టర్ ప్లాన్ తెరపైకి తీసుకొచ్చారు. పోలీసులకు విస్తృత అధికారాలు ఇచ్చి అసలు ఆటను మొదలుపెట్టారు.. ఈ క్రమంలోనే పోలీసులు హత్య కేసులో కీలకంగా ఉన్న నిందితుల వేట ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమేష్ పాల్ పై కాల్పులు జరిపిన షూటర్ విజయ్ అలియాస్ ఉస్మాన్ ను గత సోమవారం ఎన్కౌంటర్ చేశారు. ఉమేష్ హత్య కేసు కు సంబంధించి తాజాగా పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ఇది రెండవది. ప్రయాగ్రాజ్ ప్రాంతంలోని కాందియారా ప్రాంతంలో ఇది జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ సమయంలో నరేంద్ర అనే కానిస్టేబుల్ కూడా గాయపడినట్లు సమాచారం. ఎన్కౌంటర్ అనంతరం ఉస్మాన్ ను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు పోలీసులు వెల్లడించడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఉమేష్ హత్య కేసులో ఉస్మాన్ కీలక నిందితుడు. ఉమేష్ పై మొదటిగా కాల్పులు జరిపిన వ్యక్తి ఉస్మాన్. అతనిపై 50వేల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఉమేష్ హత్య జరిగిన మూడవ రోజే నిందితుడు అర్బాజ్ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఎన్ కౌంటర్ దుమన్ గంజ్ ప్రాంతంలోని నెహ్రూ పార్కులో జరిగింది.

జరిగింది ఇదీ
ఉమేష్ అతని ఇద్దరు గన్ మెన్లను ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్ లో దుండగులు కాల్చి చంపారు. రాజ్ పాల్ హత్య కేసులో ఉమేష్ సాక్షిగా ఉన్నాడు. కారు దిగిన ఉమేష్ పై దుండగులు కాల్పులు జరపడంతో అతనితోపాటు, అతడి ఇద్దరు గన్మెన్ల కు బుల్లెట్ గాయాలు కావడంతో మరణించారు. ఉమేష్ పాల్ భార్య జయపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులుగా అతిక్ అహ్మద్ తో పాటు అతిక్ సోదరుడు, ఇతరులు మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేశారు. ఉమేష్, ఇద్దరు గన్మెన్లపై కాల్పుల ఘటనను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ లేవనెత్తారు. దీంతో యోగి స్పందించి ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని శాసనసభ వేదికగా తేల్చి చెప్పారు. ఏ సమయంలో గతంలో మాఫియా కట్టడికి తీసుకున్న చర్యలను వివరించారు. ఆరోజు చెప్పినట్టుగానే నిందితులను పోలీసులు ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేస్తున్నారు.
యోగి కేవలం ఎన్కౌంటర్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఎవరైనా హత్య చేసినా, అక్రమాలకు పాల్పడినా వెంటనే నిందితుల ఇంటి ఎదుట బుల్డోజర్ ఉంటున్నది. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే నిందితుల ఇళ్లను నేలమట్టం చేస్తోంది. ఫలితంగా ఉత్తర ప్రదేశ్ లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది.. అంతేకాదు వివిధ నేరగాళ్లు, రౌడీ షీటర్లు ఉత్తర ప్రదేశ్ వదిలి పారిపోతున్నారు. ఫలితంగా అక్కడిగా ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు.. మొదటి దశ అధికారంలో టీజర్ మాత్రమే చూపించిన యోగి.. ఇప్పుడు అసలు సిసలైన ట్రైలర్ చూపిస్తున్నాడు. స్థూలంగా చెప్పాలంటే ముల్లును ముల్లుతోనే తీస్తున్నాడు.