‘‘ఆహారం.. మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషం’’. డబ్బా కొట్టుకోవడానికీ ఇది వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు విషయంలో ఇది అమితం అయిపోయిందని, గత అసెంబ్లీ ఎన్నికల వేళనే రుజువైంది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే రెండు ప్రధాన పత్రికలు మోతిక్కించిన తీరు చూస్తే.. చంద్రబాబు అఖండ మెజారిటీతో మరోసారీ పీఠం దక్కించుకోవడం ఖాయమన్నట్టుగా ఉండేది. ఆ డబ్బా చప్పుడులో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటన్నది కూడా అధినేతకు అర్థం కాలేదంటే.. ఎంత డీటీఎస్ తో మోగించారో అర్థం చేసుకోవచ్చు.
సీన్ కట్ చేస్తే.. ఏమైంది? ఎవ్వరూ ఊహించని స్థాయిలో 23 ఎమ్మెల్యేలకు పడిపోయింది టీడీపీ. ఇది చరిత్రలోనే అత్యంత దయనీయమైన పరిస్థితి. ఇందులో.. అధికార పార్టీగా చంద్రబాబు అండ్ కో చేసిన పనులే ప్రధాన పాత్ర పోషించినప్పటికీ.. అనుకూల మీడియా సప్పుడు ఓ కారణమేననే అభిప్రాయం వ్యక్తమైంది.
కడుపులో పుండు ఉందన్న విషయం జనాలకు తెలిస్తే.. ఏమనుకుంటారోనని అనుకొని మురగబెట్టుకుంటే.. మాత్రలతో పోయేది కాస్తా ఆపరేషన్ దాకా పోవచ్చు. చివరకు ప్రాణాల మీదకు కూడా రావొచ్చు. చంద్రబాబు విషయంలో ఆయన అనుకూల మీడియా అచ్చంగా ఇదే పని చేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది. బాబు తప్పులన్నీ కాస్తూ.. అంతా బాగానే ఉందని ప్రచారం చేస్తూ.. తిరుగులేని గెలుపు సాధిస్తారనే ప్రచారం చేయడంతో.. ఎక్కడ పొరపాట్లు జరిగాయోననే విషయం కూడా బాబుకు తెలియకుండా పోయింది. దీంతో.. జరగాల్సిన దారుణ నష్టం జరిగిపోయింది.
అయితే.. ఇంత జరిగిన తర్వాత కూడా.. ఇంకా అదే డబ్బా కొడుతోంది ‘ఎల్లో’ మీడియా. అధికారం కోల్పోయిన తర్వాత కూడా బాబును వదిలిపెట్టట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతి చేయడం ఎవరికైనా, ఏ విషయంలోనైనా ప్రమాదమే. బాబు విషయంలో ఆయన అనుకూల మీడియా ఇంకా తీవ్రంగా చేస్తోందని అంటున్నారు. మరి, ఇది ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడాలని అంటున్నారు.