Yellow Fever: కోవిడ్ నుంచి తేరుకోక ముందే.. మంకీ ఫాక్స్ వైరస్ భయం తొలగకముందే.. ఇప్పుడు ప్రపంచాన్ని మరోవైరస్ వణికిస్తోంది. అదే ఎల్లో వైరస్. సరిగ్గా 2013లో ఆఫ్రికా ఖండాన్ని ఈ ఎల్లో ఫీవర్ కకావికలం చేసింది. సుమారు 84 వేలమంది ఈ జ్వరం బారిన పడ్డారు. 60 వేల వరకు మరణాల సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. సుమారు రెండేళ్ల పాటు ఆఫ్రికాలోని ఆయా దేశాలకు ఇతర దేశాలు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపేశాయి. అత్యవసరం అయితే తప్ప వాణిజ్య కార్యకలాపాలను కూడా నిలుపుదల చేశాయి. సరిగా తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు ఎల్లో ఫీవర్ ఆఫ్రికా ఖండం పై మళ్లీ విరుచుకుపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెజిల్ దేశంలో కూడా ఈ తరహా కేసులు వెలుగులోకి వస్తుండడం ప్రపంచ ఆరోగ్య సంస్థను ఆందోళనకు గురిచేస్తోంది.

ఎలా వస్తుంది అంటే
ఈ జ్వరానికి ప్రధాన కారణం ఎడిస్ ఈజిప్టై అనే దోమ. ఆఫ్రికా, అమెరికాలోని జంగిల్ కానోపి అని పిలిచే అడవుల్లో నివసించే కోతుల్లో ఫ్లేవీ అనే వైరస్ ఉంటుంది. ఆ కోతులు జ్వరాల బారిన పడ్డప్పుడు ఈ వైరస్ చలనం ఉధృతంగా ఉంటుంది. ఆ సమయంలో ఎడిస్ దోమలు పుట్టినప్పుడు ఆ వైరస్ వాటిలోకి వెళుతుంది. తిరిగి ఆ దోమలు మనుషులను కుట్టినప్పుడు వారిలోకి వైరస్ ప్రవేశిస్తుంది. ఈ సమయంలో మొదటి ఐదు రోజుల వరకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత నీరసం, అలసట, దాహం లేకపోవడం, కండరాల నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ సమయంలో సరైన చికిత్స తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అలాగే నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి విషమంగా మారుతుంది.
Also Read: Bigg Boss 6: 25న క్వారంటైన్‌కి వెళ్తున్న బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్
లక్షణాలు ఎలా ఉంటాయంటే
ఎల్లో ఫీవర్ రెండో దశలో పునరావృతమయ్యే జ్వరం, పొత్తికడుపునొప్పి, వాంతులు, కొన్నిసార్లు రక్తంతో కూడిన విరోచనాలు, తీవ్రమైన అలసట, బద్ధకం, కామెర్లు, ఇది చర్మం, కళ్ళను పసుపు రంగులోకి మారుస్తుంది. మూత్రపిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం, రక్తస్రావం, మతిమరుపు, మూర్చ, కొన్నిసార్లు కోమా, క్రమరహితంగా ఉండే హృదయ స్పందనలు, ముక్కు, నోరు కళ్ళ నుంచి రక్తస్రావం, వీటి తర్వాత శరీరం అచేతనంగా మారిపోవడం, ఆ తర్వాత మరణం సంభవించడం వంటివి జరుగుతాయి. 2013లో ఆఫ్రికా ఖండం లోని పలు దేశాల్లో ఈ లక్షణాలతోనే వేలాదిమంది కన్నుమూశారు. అయితే ఇది అంటువ్యాధి కాదు. కేవలం ఇది వైరస్ ను మోసే దోమల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. ఆఫ్రికాలోని దేశాలు, ముఖ్యంగా ఉప సహారా ఆఫ్రికా, ఉష్ణ మండల దక్షిణ అమెరికా, కరేబియన్ దీవుల్లో ఈ తరహా జ్వరాల వ్యాప్తి ఉంటుంది.
మరణం ఎలా సంభవిస్తుందంటే
ఎల్లో ఫీవర్ అనేది హేమరిజిక్ పరిస్థితి. అంటే అధిక జ్వరం వల్ల చర్మం, కాలేయం, మూత్రపిండాలలో అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. పైగా మూత్రపిండాలలో కణాల మరణానికి దారి తీస్తుంది. తగినంత కాలేయ కణాలు చనిపోతే కాలేయం దెబ్బతింటుంది. ఇది కామెర్లకు దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ఈ జ్వరం ఆకస్మాత్తుగా మొదలవుతుంది. దేహ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఫ్లావీ వైరస్ ఉధృతి పెరిగే కొద్దీ శరీరమంతా అచేతనంగా మారిపోతుంది.

అయితే 2013 స్థాయిలోనే ప్రస్తుతం ఎల్లో ఫీవర్ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలోని
నైజీరియాలోని 206 మిలియన్ల మందిలో కనీసం 160 మిలియన్ల మంది ప్రస్తుతం ఎల్లో ఫీవర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఈ సంఖ్య దాదాపు 25% మంది ఆఫ్రికన్లలో వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వ్యాధి నియంత్రణలో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, గావా సంయుక్త ఆధ్వర్యంలో వైరస్ ప్రభావిత లక్షణాలు ఉన్నవారికి టీకాలు వేసే కార్యక్రమానికి ముందడుగు పడింది. అయితే ఆఫ్రికా ఖండంలో దేశాలతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే ఇతర దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ఆ ప్రాంతాల్లో పర్యటించకూడదని సూచించింది.