Yellow Crazy Ants- Tamil Nadu: “మిడతలు వాలిన పొలం.. కాళకేయులు అడుగు పెట్టిన రాజ్యం బాగుపడవు”. బాహుబలి లో ఓ డైలాగ్ ఇది. అది సినిమా కాబట్టి కొంత ఊహ ఉంటుంది. కానీ వాస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితే తమిళనాడు ఎదుర్కొంటున్నది. కాకపోతే ఇక్కడ మిడతల స్థానాన్ని చీమలు ఆక్రమించాయి. చీమలు ఏంటి? మిడతలతో పోలికేంటి? అనుకుంటున్నారా? నిన్నా మొన్నటి దాకా కూడా తమిళులు కూడా ఇలాగే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ చీమలు వారికి చుక్కలు చూపిస్తున్నాయి. చీమల దెబ్బకు ఏడు గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు బతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయారు.
ఇంతకీ ఎంటీ ఈ చీమల కథ
ఎల్లో క్రేజీ ఆంట్స్.. చూసేందుకు చిన్నగా కీటకాల మాదిరి కనిపిస్తాయి. కానీ చురుగ్గా కదులుతాయి. దేన్ని కనిపిస్తే దాన్ని తినేస్తాయి. పెద్ద పాము నైనా, పాకే బల్లి నైనా, ఎగిరే తుమ్మెద నైనా ఇవి తినేస్తాయి. స్థానిక కీటక జాతులను, చీమల పుట్టలను ఆక్రమించి నాశనం చేస్తుంటాయి. తమిళనాడు లో దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ లోని ఏడు గ్రామాల్లో విర విహారం చేస్తున్నాయి. పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి. పశువులు, మేకలు, ఎద్దులకు హాని చేస్తున్నాయి. పశువులకు గాయాలైన చోట మాంసాన్ని తినేస్తున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని పశువులు కన్నుమూశాయి. మేకలు, ఇంకొన్ని ఎద్దులు చూపుకోల్పోయాయి. గతంలో ఇలాంటి చీమల బెడద లేదని వేలాయుధంపట్టి వాసులు చెబుతున్నారు. అడవుల నుంచి లక్షలాదిగా వస్తున్న ఈ చీమలు.. తేమ వాతావరణంలో మరింత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఎక్కడైనా నిల్చుంటే క్షణంలో మనుషుల శరీరం పైకి పాకిస్తున్నాయి. పొత్తి కడుపున ఫార్మిక్ యాసిడ్ అనే ద్రవాన్ని విసర్జిస్తున్నాయి. దీనివల్ల శరీరం పై దురద ఏర్పడుతోంది. పైగా చర్మం పెలుసుల మాదిరి ఊడిపోతోంది.
గతంలో కేరళ అడవుల్లో కనిపించాయి
ఎల్లో క్రేజీ యాంట్స్.. గతంలో కేరళ అడవుల్లో కనిపించాయి. దీనిపై సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ ప్రతినిధులు పరిశోధనలు చేశారు. గతంతో పోలిస్తే వీటి జాతి ఇప్పుడు బాగా పెరుగుతున్నదని, గొంగళి పురుగులు, సీతాకోకచిలుకల సంఖ్య తగ్గుతున్నదని కనుగొన్నారు. ఆసియా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఆఫ్రికాలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. 5 మి.మీ వరకు పొడవు ఉంటాయి. గోధుమ, ఎరుపు వర్ణంలో ఉంటాయి. పొడవయిన కాళ్ళు, తల మీద యాంటెన్నా లాంటింది ఉంటుంది. 80 రోజుల వరకు బతుకుతాయి. ఆస్ట్రేలియా లో క్రిస్ మస్ ఐలాండ్ లో అడుగు పెట్టిన ఈ చీమలు అక్కడుండే లక్షలాది పీతలను తినేశాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్నది. దీంతో వాటిపై పరిశోధనలు చేసి పరిష్కార మార్గాలు కనుగొన్నారు. హెలికాప్టర్ ద్వారా మందుల్ని పిచికారి చేశారు. దీనివల్ల 90 నుంచి 95% వరకు వాటి సంతతి తగ్గింది. చిన్న తుమ్మెద లాంటి కీటకం ద్వారా సహజ పద్దతి ద్వారా వీటి ఆహారపు గొలుసు తుంచి వీటి సంతతి తగ్గించాలనే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.