Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ పై వ్యూహాత్మకంగానే విమర్శలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో ప్రతిపక్ష హోదా కోసం పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఏపీలో తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ అయినా దాని ఉనికి రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో జనసేన తన గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తోంది. ఇందుకు గాను వైసీపీపై ఆరోపణల అస్ర్తం ఎక్కుపెడుతోంది. దీనికి వైసీపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. జనసేనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ దానికి ప్రచారం కల్పిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే క్రమంలో పలు ఎత్తులు వేస్తున్నారు. తమ పార్టీ విజయం సాధించాలనే విషయంలో పలు మార్గాలు వెతుకుతున్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల్లో జనసేన సక్సెస్ సాధించినట్లే. ఎందుకంటే వైసీపీలోని మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరు స్పందించి జనసేనకు తగిన ప్రచారం కల్పించారు. అసలు ఏ మాత్రం ఓటు బ్యాంకు లేని పార్టీ ఇప్పుడు ప్రజల నాలుకల్లో నానుతోంది. ఇదే పవన్ కల్యాణ్ ప్రత్యేక వ్యూహంలా కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ వైసీపీపై తనదైన శైలిలో విమర్శలు చేయడంతో ఆ పార్టీ కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. రాష్ర్టంలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని పవన్ కు దూరం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవికి ప్రభుత్వం సరైన గౌరవ మర్యాదలు ఇస్తుందన్న సంకేతాలు పంపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, జగన్ మధ్య సత్సంబంధాలు ఉండడంతో ఆయన కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కన్నబాబు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు కావడంతో పవన్ విషయంలో చిరంజీవి పెదవి విప్పడం లేదు. దీంతో వైసీపీ కూడా ఉద్దేశపూర్వకంగానే పవన్ ను ఒంటరి వాడిని చేయాలనే ఆలోచనతోనే ఈ విధమైన చర్యలకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో చోటుచేసుకున్నపరిణామాలతో రెండు పార్టీల్లో వైషమ్యాలు తారాస్థాయికి చేరాయి.