YS Jagan : పరిషత్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ విజయ దుందుభి మోగించింది. ఈ విజయాన్ని సాధించడంలో మంత్రులు సర్వశక్తులూ ఒడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేశారు జగన్. ఆయా జిల్లాల మంత్రులతోపాటు ఇన్ ఛార్జ్ మంత్రులకూ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో వచ్చే ఫలితాలను అనుసరించే పదవుల పంపకాలు ఉంటాయనే వార్నింగ్ కూడా ఇచ్చారనే వార్తలు వచ్చాయి. మరి, మంత్రులు ఏం చేశారో మొత్తానికి అధికార పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
మొదట జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం వరకు పంచాయతీలను వైసీపీ సొంతం చేసుకుంది. మునిసిపాలిటీ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగింది. తాడిపత్రి మునిసిపాలిటీ తప్ప, అన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇప్పుడు పరిషత్ ఎన్నికల ఫలితాల్లోనూ అదే జోరు కొనసాగింది. అభ్యర్థుల ఎంపిక నుంచి, పార్టీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేయడంలోనూ మంత్రులు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి.
మంత్రివర్గ విస్తరణ అంశం కూడా మంత్రులతో పనిచేయించిందనే చెప్పాలి. విస్తరణ ఎప్పుడు జరిగినా దాదాపు 90 శాతం మంది కేబినెట్ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని హింట్ ఇచ్చేశారు జగన్. దీంతో.. ఎవరి బెర్త్ ఉంటుందో.. ఎవరిది ఊడుతుందో తెలియని పరిస్థితి. అందుకే.. ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పనిచేశారని అంటున్నారు విశ్లేషకులు. ఈ కారణంగానే.. ఇలాంటి ఫలితాలు వచ్చాయని అంటున్నారు.
అయితే.. ఈ ఫలితాల్లో జగన్ కు మరింత కిక్కించిన ఫలితం ఏదైనా ఉందంటే.. అది కుప్పంలో జెండా ఎగరేయడమేనని అంటున్నారు. కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కంచుకోటగా చెబుతుంది టీడీపీ. దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ జెండానే ఎగురుతోంది కూడా. అయితే.. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పసుపు జెండా వెలిసిపోయింది. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన 66 ఎంపీటీసీ స్థానాల్లో.. ఏకంగా 63 వైసీపీ గెలుచుకోవడం విశేషం. నాలుగు జెడ్పీటీసీలను కూడా సొంతం చేసుకుంది.
దీంతో.. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల కూడా ఇదే విధంగా ముందుకు సాగాలని, రెట్టించిన ఉత్సాహంతో టీడీపీని కూల్చేయాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే విధంగా వ్యవహరించాలని మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. మరి, ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు అన్నది చూడాలి.