Vasupalli Ganesh Kumar: వాసుపల్లి గణేష్ కుమార్ కు షాక్ ఇవ్వనన్న వైసీపీ హై కమాండ్?

కొద్దిరోజులు కిందటి వరకు వాసుపల్లి వైపు మొగ్గు చూపినా.. నమ్మకమైన నేతలను బరిలో దించకపోతే ఇబ్బందికర పరిస్థితిలు ఎదురవుతాయని వైసిపి అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : November 23, 2023 8:40 am

Vasupalli Ganesh Kumar:

Follow us on

Vasupalli Ganesh Kumar: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను సైడ్ చేస్తున్నారా? ఈయన విషయంలో వైసిపి హై కమాండ్ వేరే ఆలోచనలో ఉందా? ప్రత్యామ్నాయ నాయకుడును తెరపైకి తెచ్చి ప్రోత్సహిస్తుందా? వాసుపల్లి పై అనుమానంతో ఈ చర్యకు దిగిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ తనకేనని వాసుపల్లి ధీమాతో ఉన్నారు. కానీ హై కమాండ్ మాత్రం అంత సుముఖంగా లేదని వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజులు కిందటి వరకు వాసుపల్లి వైపు మొగ్గు చూపినా.. నమ్మకమైన నేతలను బరిలో దించకపోతే ఇబ్బందికర పరిస్థితిలు ఎదురవుతాయని వైసిపి అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

2019 ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండోసారి వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. కానీ వైసీపీలోకి ఫిరాయించారు. గత మూడున్నర సంవత్సరాలుగా ఆయన పార్టీలో సెట్ కాలేదు. ఆది నుంచి వైసీపీలో ఉన్న వారిని అణగదొక్కారని.. పార్టీలో వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2009 నుంచి ఆయన దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక్కడ టిడిపి బలంగా ఉంది. వాసుపల్లి వైసిపి రాకతో చాలా వర్గాలు పార్టీకి దూరమయ్యాయి.

రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండడంతో వాసిపల్లిపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. పైగా 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన టిడిపిని కాదని వైసీపీలో చేరారు. రేపు పొద్దున్న వైసీపీకి మెజారిటీ తగ్గితే.. ఆయన టిడిపిలోకి వెళ్లరని గ్యారంటీ ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అటు పార్టీ సర్వేల్లో సైతం వాసుపల్లి గణేష్ కుమార్ వెనుకబడినట్లు తెలుస్తోంది. అందుకే అభ్యర్థి మార్చితే కానీ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీలో వర్గాలు కలిసి పనిచేయవని హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నియోజకవర్గ నుంచి కోలా గురువులను బరిలో దించేందుకు వైసిపి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన గురువులు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో హై కమాండ్ ఆయనను విశాఖ డిసిసిబి అధ్యక్ష పదవి ఇచ్చింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమించింది. దక్షిణ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన్ను హై కమాండ్ ప్రోత్సహిస్తోంది. ఆయన అభ్యర్థి అయితే వైసీపీలోని అన్ని వర్గాలు కలిసి పని చేస్తాయని హై కమాండ్ ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.