
YCP: శాసనమండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ రానుంది. ఇప్పటికే వైసీపీకి 18 మంది ఎమ్మెల్సీలుండగా ఇప్పుడు చేపట్టే ఎన్నికలతో వైసీపీ బలం పెరగనుంది. దీంతో ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలతో శాసనమండలిలో వైసీపీ బలం 32కు పెరగనుంది. దీంతో శాసనాల నిర్మాణంలో వైసీపీ మాట చెల్లుబాటు కానుందని తెలుస్తోంది. కానీ ఇప్పటికే మండలి రద్దుకు వైసీపీ తీర్మానం చేసిన నేపథ్యంలో రద్దు భయం నేతల్లో పట్టుకుంది.
నిబంధనల ప్రకారం మండలిని రద్దు చేయాలని గతంలోనే వైసీపీ(YCP) తీర్మానం చేసి మరీ కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే మండలి రద్దు చేయొద్దని వైసీపీ కేంద్రం దగ్గర మోకరిల్లుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై వైసీపీ కూడా తనదైన శైలిలో సమాధానం చెబుతోంది. మండలి రద్దుకు కట్టుబడి ఉన్నామని సజ్జల ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మండలి రద్దుపై ప్రతిపక్షాల గోలతో సర్కారు ఇరుకున పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ శాసనమండలి రద్దు అయితే సర్కారుకు నష్టమే కానీ లాభం మాత్రం ఉండదు. తొందరపడి మండలి రద్దు చేస్తామని వైసీపీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించి అభాసుపాలైంది. ఈ క్రమంలో ఇప్పుడు మండలిలో బలం పెరుగుతున్నందున రద్దు చేస్తే ప్రభుత్వానికే నష్టం కలిగే అవకాశాలున్నాయి.
మండలి రద్దుపై ఇప్పుడు వెనక్కి తగ్గితే మాట తప్పిన నింద పడే అవకాశముంది. అందుకే మండలి రద్దుకే నిర్ణయించుకున్నామని చెబుతోంది. కానీ ఇప్పుడు మండలిలో పూర్తి స్థాయి బలం పెరిగితే మండలి రద్దుకు కేంద్రం ఓకే అంటే పరిస్థితి ఏంటనే దానిపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది వైసీపీకి ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలి రద్దుపై వైసీపీ ఏం చర్యలు తీసుకుంటుందోననే మీమాంస ప్రజల్లో నెలకొంది.
Also Read: సీఎం జగన్ కు ఏమైంది? విశ్రాంతి ఎందుకు అవసరం?