AP Politics: ఏపీలో అస్సలు బలం లేని బీజేపీ వైపు.. అధికారంలో ఉండి అత్యంత బలంగా ఉన్న వైసీపీ మరోవైపు.. మధ్యలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీ.. ఈ మూడు పార్టీలు ఏపీ రాజకీయాల్లో ప్రబలంగా ఉన్నాయి. అయితే అటు వైసీపీ, ఇటు టీడీపీ రాజకీయానికి బీజేపీ బలవుతోంది. ఇప్పుడు అభం శుభం తెలియని ఏపీ బీజేపీపై నెపాన్ని మోపేస్తున్నాయి వైసీపీ, టీడీపీలు.. అసలు ఏపీలో బలం లేని.. పెద్దగా నాయకుల సత్తా లేని బీజేపీని టార్గెట్ చేయడం..పైగా బీజేపీని బేస్ చేసుకొని ఒకరిపై మరొకరు అంటగట్టి మరీ రాజకీయం చేయడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఈ లొల్లిని షురూ చేసింది మంత్రి పేర్నినాని. చంద్రబాబు ఏజెండానే బీజేపీ ఎజెండాగా అమలు చేస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. . చంద్రబాబు ఏది చేపడితే అది పట్టుకొని బీజేపీ పోరాటం చేస్తోందని.. అసలు ఆ పార్టీకి సొంత ఎజెండా లేదంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు ఏదీ తీసుకుంటే అదే ఎజెండా తీసుకొని విమర్శలు చేసే ముందు బీజేపీ నేతలు ఒకసారి తమ గురించి తాము ఆత్మవలోకనం చేసుకోవాలని పేర్ని నాని హితవు పలికారు.
Also Read: AP Theaters: థియేటర్ల నిండా కన్నీళ్ల మయం.. ఏపీ అంతా అయోమయం !
అయితే బీజేపీని టీడీపీకి అంటగట్టి వైసీపీ మంత్రి చేసిన ఆరోపణలతో తెలుగుదేశం అలెర్ట్ అయ్యింది. బీజేపీని మాకు అంటగడుతారా? అంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ నెట్ వర్క్ లోనే ఏపీ బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలు కొనసాగిస్తున్నా రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం నోరెత్తడం లేదని పీఏసీ చైర్మన్ పయ్యావుల దుయ్యబట్టారు. బీజేపీకి బ్రాండ్ గా ఉన్న హిందుత్వ అంశాలపైనా మౌనంగా ఉన్నారని.. ఆలయాలపై దాడులు జరిగినా బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని వైసీపీతో బీజేపీని అంటగట్టే ప్రయత్నం చేశారు.
నిజానికి ఏపీ బీజేపీ అటు వైసీపీని.. ఇటు టీడీపీని టార్గెట్ చేసి రాజకీయం చేస్తోంది. జనసేనతో కలిసి వైసీపీని ఓడించాలని… ప్రధాన ప్రతిపక్షం టీడీపీని తుత్తునియలు చేసి ఆ స్థానంలోకి రావాలని యోచిస్తోంది. బీజేపీ స్టాండ్ మరోలా ఉంటే ఆ పార్టీని ఇతరులకు అంటగడుతూ దాని విశ్వసనీయతను దెబ్బతీసే సరికొత్త రాజకీయాన్ని టీడీపీ, వైసీపీ చేస్తోందని అర్థమవుతోంది. మరి ఈ రాజకీయం ఎటువైపు దారితీస్తుందనేది వేచిచూడాలి.
Also Read: Lokesh: లోకేష్ మంకుపట్టు.. టీడీపీ యువనేత నేత బలి?