Bandi Sanjay: తెలంగాణలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధవాతావరణం నడుస్తోంది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు అంటుండగా.. కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. దీంతో రైతులు అయోమయం చెందుతున్నారు.
ఈక్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పరస్పరం రాస్తారోకోలు, బంద్ లు, నిరసనలతో తెలంగాణలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. ఈ విషయం ఎటూ తేలకుముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఇటీవల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో చేపడుతున్న నిరుద్యోగ దీక్షకు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
Also Read:Telangana Politics: బీజేపీ, కాంగ్రెస్ లకు చెక్ పెట్టే కేసీఆర్ ప్లాన్ ఇదీ
సంజయ్ పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు హైదరాబాద్ కు భారీగా తరలి వెళుతుండగా తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్, బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ల మధ్య మాటలయుద్ధం నడిచింది. కాగా బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షపై టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలోని రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే బండి సంజయ్ నిరుద్యోగ దీక్షకు పూనుకున్నారని విమర్శించారు. వరి కొనుగోళ్ల విషయంలో రైతులు అయోమయంలో ఉన్నారని ఇలాంటి సమయంలో చర్చను పక్కదారి పట్టించేలా టీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే నిన్నటి వరకు రైతు సమస్యలపై ప్రస్తావించిన బీజేపీ నాయకులు సడెన్ గా నిరుద్యోగ దీక్ష చేపట్టారని విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతుల్లో వచ్చిన వ్యతిరేకత నుంచి ఆపార్టీని బయట పడేసేందుకు బీజేపీ కొత్త సమస్యను తెరపైకి తెచ్చిందన్నారు. రైతు సమస్యను పక్కను పెట్టేలా టీఆర్ఎస్, బీజేపీలు కొత్త నాటకం ఆడుతున్నాయనే అనుమానాలు రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో తెలియదుగానీ.. నిరుద్యోగ దీక్ష కోసం బీజేపీ ఇచ్చిన సమయాన్ని అంతా తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉందని అంతా ఒప్పుకుంటున్నారు.
ఈ సమస్యపై గతంలోనే వైస్సాఆర్టీపీ, కాంగ్రెస్ పార్టీలు పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలోనే రైతులకు ధాన్యం కొనుగోలు సమస్య రావడంతో వారంతా అన్నదాతలకు మద్దతుగా పోరాటాలు చేస్తున్నారు. నిన్నటి వరకు రైతు సమస్యలపై ప్రస్తావించిన బీజేపీ సడెన్ గా చర్చను పక్కదారి పట్టేలా నిరుద్యోగ సమస్యను ఎత్తుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ ఇరుకున పడుతోంది.
Also Read: Telangana Politics: ఏం స్ట్రాటజీ కేసీఆర్ సార్.. కాంగ్రెస్, బీజేపీ ఉక్కిరిబిక్కిరి?