Jagan- MLAs: సాధారణంగా అధికార పార్టీ టిక్కెట్ కు విపరీతమైన పోటీ ఉంటుంది. అభ్యర్థులు ఎగబడతారు. రకరకాల ఒత్తిళ్లు చేస్తారు. తమకే కావాలని ఫోర్స్ చేస్తారు. కానీ ఏపీలో మాత్రం అధికార వైసీపీలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. పనితీరు బాగాలేకపోతే అభ్యర్థులను మార్చేస్తానని ఎప్పటి నుంచో జగన్ చెబుతూ వస్తున్నారు. ఎమ్మెల్యేలతో ప్రతి నెలా జరుగుతున్న సమావేశంలో తప్పిస్తానన్న వారి సంఖ్యను బయటకు వెల్లడిస్తూ నేతలను భయపెడుతున్నారు. ప్రజల్లో తిరగని వారిని ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ కేటాయించేది లేదని తేల్చిచెప్పినట్టు హాట్ గా ప్రచారం సాగుతోంది. అయితే జగన్ తప్పిస్తారో లేదో కానీ పార్టీలో ఒక పాతిక మంది ఎమ్మెల్యేలు తాము పోటీ చేయమని అధినేతకు నేరుగా చెప్పినట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారిని నయానో భయానో దారికితెచ్చుకొని.. వారితో పనిచేయించాలని చూస్తే సీఎం జగన్ కే వారు ఝలక్ ఇచ్చారు. అయితే కేవలం రాజకీయ కారణాలతోనే కాకుండా రకరకాల కారణాలు చూపుతూ వారంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేమని చెబుతున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి వైసీపీలో ఎమ్మెల్యేలు ఏమంత కంఫర్టుగా లేరు. పేరుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పించి..పవరు లేదు..నిధులు రావు. తామంతా ఉత్సవ విగ్రహాలుగా మిగిలామన్న వ్యధ ఉంది. అటు నియోజకవర్గ నిధుల కేటాయింపులు కూడా లేవు. జగన్ అదిగో ఇదిగో అంటున్నారే తప్ప విడుదల చేయడం లేదు. గ్రామస్థాయిలో వలంటీర్లు, రాష్ట్ర స్థాయిలో మీట నొక్కుడుతో సీఎం జగన్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటున్నారు తప్ప..పార్టీ ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ఎటువంటి ప్రయోజనం లేకపోతోంది. అటు నాయకులు, కార్యకర్తలు చెప్పిన పనులు చేయలేని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే పదవి ఉండడం కంటే ఖాళీగా ఉండడమే నయం అన్న నిర్ణయానికి కొంతమంది వచ్చేస్తున్నారు. అటు రోజురోజుకూ ఎక్కువవుతున్న ప్రజా వ్యతిరేకత సైతం కొంతమంది ఎమ్మెల్యేల్లో పునరాలోచనలో పడేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ వారసులను రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని జగన్ చెవిట్లో వేస్తున్నారు. దీంతో ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో వారు అసంతృప్తికి గురవుతున్నారు. తాము యాక్టివ్ గా ఉన్నప్పుడే పిల్లలకు మార్గం చూపుదామంటే సీఎం జగన్ అడ్డుకట్ట వేయడం వారికి రుచించడం లేదు. పైకి సీఎం నిర్ణయానికి తలూపుతున్నా లోలోపల మాత్రం రగిలిపోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులు పోటీలో దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.వైసీపీలో ఆ పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యేలు తెగ బాధపడుతున్నారు. అధినేత వ్యవహార శైలిపై అంతర్గత సమావేశాల్లో తిట్టిపోస్తున్నారు.

మరికొందరైతే తాము అనారోగ్యంతో తిరగలేకపోతున్నామని.. ఏదో ఒక నిర్ణయం తీసుకోండని అధినేతకు కోరుతున్నారు, ఇటువంటి వారు ఒక పది మంది వరకూ ఉన్నారు. మాజీ మంత్రి రంగనాథరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వంటి వారు మీరు ఇచ్చే టాస్క్ పూర్తిచేయలేం. నిత్యం ప్రజల మధ్య ఉండడమంటే కుదరని పని. అందుకే మేమే స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాం. మీరిచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారుట. అటు గత ఎన్నికల్లో ఉన్నదంత ఊర్చి పెట్టిన చాలా మంది ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టిన సొమ్ము కూడా తెచ్చుకోలేకపోయారుట. కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇచ్చినా కొంత సర్దుబాటు చేసుకునేవారమని.. కనీసం ఫండ్స్, పవర్స్ లేని పదవులెందుకని ప్రశ్నిస్తున్నారుట. అయితే ఎమ్మెల్యేల్లో సగం మందిని మార్చేస్తానని జగన్ హెచ్చరికలు పక్కకు వెళ్లిపోయాయి. ఎమ్మెల్యేలే ఎదురెళ్లి మాకు టిక్కెట్లు ఇవ్వొద్దన్న రేంజ్ కు పరిస్థితి రావడంతో సీఎం జగన్ తల పట్టుకుంటున్నారు.