
వైసీపీలో జగన్ తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు.. ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. నెంబర్ 2 అనేవారు ఎవరూ లేరక్కడ! ఎవరికి వారు ఏదో ఒక పేరు చెప్పొచ్చుగానీ.. పార్టీలో, ప్రజల్లో.. జగన్ తర్వాత ప్లేస్ పలానా వ్యక్తిదే అనే పరిస్థితి అయితే ఇప్పటి దాకా వైసీపీలో లేదు. దీన్ని ఎవరూ ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. ఆయన పార్టీ కాబట్టి.. అధికారంలో ఉంది కాబట్టి.. ఎవరూ క్వశ్చన్ చేసే పరిస్థితీ లేదు. అయితే.. ప్రభుత్వం దగ్గరికి వచ్చే సరికి కూడా ఇదే తీరు కొనసాగుతుండడం గమనార్హం. దీంతో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టిన ముఖ్యమంత్రి జగన్.. సంక్షేమం మీదనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఉద్యోగుల జీతాలకే ఇబ్బందులు పడేలా ఖజానా నిండుకున్న ఈ పరిస్థితుల్లో.. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే పరిస్థితి లేదు. దీంతో.. ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము పలానా పని చేస్తున్నామని ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. పోనీ.. సంక్షేమంలోనైనా ప్రజాప్రతినిధులను భాగం చేస్తున్నారా.. అంటే అదీ లేదు. నేరుగా ప్రభుత్వం నుంచి లబ్ధిదారుల అకౌంట్లోకే నగదు బదిలీ అయిపోతోంది. దీంతో.. ఇక్కడ కూడా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పనిలేకుండా పోయింది.
ఇక, అధినేతతో తమ గోడు వెళ్లబోసుకుందామని చెప్పుకోవడానికీ అవకాశం లభించట్లేదు. ముఖ్యమంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. దీంతో.. ఏం జరుగుతోందని సీఎం అడగడం.. అధికారులు చెప్పడంతో సమావేశాలు ముగిసిపోతున్నాయి. తద్వారా.. అక్కడ కూడా వీరు ఏమీ చెప్పుకోవడానికి ఉండట్లేదు. ఇక, గ్రామాల్లో ఏదైనా సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా ఎమ్మెల్యేలను, ఎంపీలను దర్శించుకోవాల్సిన పనిలేదు. గ్రామ వలంటీర్లతోనే ఆ పనికూడా జరిగిపోతోంది.
దీంతో.. ఇక తాము ఏం చేయడానికి ఉన్నామని మౌనంగా ప్రశ్నిస్తున్నారట ఎంపీలు, ఎమ్మెల్యేలు. ప్రస్తుత పరిస్థితి కారణంగా ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బందులు వస్తాయని వీరు భావిస్తున్నారట. అటు జగన్ మాత్రం.. వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు సొంత గుర్తింపు వచ్చేలా చూస్తే.. ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు సమయంలో రెబల్ గా మారే అవకాశం ఉంటుందని, అందుకే.. అన్నీ తన చేతులో పెట్టుకొని బండి నడిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి, ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? బెడిసి కొడుతుందా? అన్నది చూడాలి.