Avanigadda: ఏపీలో అధికార వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. సమస్యలు పరిష్కరించాలని కోరిన పాపానికి జనసేన, టిడిపి నేతలపై సాక్షాత్ వైసీపీ ఎమ్మెల్యే కర్రలతో దాడి చేశారు. వెంటపడి మరి కొట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో వెలుగు చూసింది. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తో పాటు వైసీపీ నేతలు వీధి పోరాటానికి దిగారు. జనసేన, టిడిపి శ్రేణులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రేక్షక పాత్రకు పరిమితమైన పోలీసులు.. తిరిగి జనసేన, టిడిపి శ్రేణులను మాత్రమే అదుపులోకి తీసుకోవడం విశేషం.
గత ఏడాది సీఎం జగన్ అవనిగడ్డ నియోజకవర్గం లో పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.93 కోట్లనిధులు కేటాయించారు. కానీ పనులు మాత్రం జరిపించలేకపోయారు. ఆ హామీలకు ఏడాది పూర్తయిన సందర్భంగా టిడిపి, జనసేన మహా ధర్నాకు పిలుపునిచ్చాయి. అయితే 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నాకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మండలి బుద్ధ ప్రసాద్ తో పాటు టిడిపి నాయకులకు నోటీసులు ఇచ్చి గృహనిర్బంధం చేశారు. కీలక నాయకులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.
అయితే తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటి వద్ద మహాధర్నాకు ఉపక్రమించాయి. దీనిని తట్టుకోలేకపోయినా ఎమ్మెల్యే రమేష్ బాబు కర్రను తీసుకొని వారిపై విరుచుకుపడ్డారు. ఇదే అదునుగా వైసిపి నేతలు సైతం ఎమ్మెల్యేను అనుసరించారు. టిడిపి, జనసేన కార్యకర్తలను అక్కడ నుంచి తరిమికొట్టారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. పోలీసుల అక్కడ మౌనంగా ఉండి పోవడం విశేషం. కొంతమంది టిడిపి, జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజంతా తిప్పుతూ.. సాయంత్రానికి విడిచిపెట్టారు. అయితే చాలామంది కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. అందులో మహిళలు కూడా ఉండడం విశేషం.
మరోవైపు అవనిగడ్డ పట్టణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 144 సెక్షన్ అమల్లో ఉందన్న సాకు చూపి సాధారణ ప్రజల రాకపోకలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నివాసం సమీపంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి మరి ప్రయాణికులను, వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంతోపాటు పోలీసుల వ్యవహార శైలిని తప్పుపట్టారు.