Fake Currency- YCP Leaders: ఆ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి ఒక సలహా ఇచ్చారు. కొవిడ్ సంక్షోభం నుంచి ప్రజలు బయటపడాలంటే డబ్బు ప్రింట్ చేసి పంచేయడమే ఉత్తమని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవమెంతుందో తెలియదు కానీ.. ఏపీలో వైసీపీ నేతలు మాత్రం ఇప్పుడు అదే పనిచేస్తున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అది ప్రజల కోసం కాదు. తమ కోసం తామే డబ్బులు ప్రింట్ చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వలంటీరు నుంచి కుల కార్పొరేషన్ డైరెక్టర్ వరకూ దొంగ నోట్లు చలామణి చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న దొంగనోట్ల కేసుల మూలాల వెనుక అధికార పార్టీ నేతల పేర్లు బయటపడుతుండడంతో ఇక వీరికి మిగిలింది దొంగనోట్ల వ్యాపారమే కదా అని ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ల్యాండ్, శాండ్, మైన్, వైన్ దేనినీ వదల్లేదు. ఇప్పుడు ఈ దొంగనోట్లపై పడ్డారని కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి.

పల్నాడు జిల్లా చర్లగుడిపాడులో కోటిన్నరకు పైగా దొంగనోట్లు బయటపడ్డాయి. ఇంట్లోనే ప్రింట్ చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలింది. అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపించాయి. తయారుచేస్తున్న వారికి వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆ విషయం బయటపెట్టడం లేదు. వారికి ఉన్న రాజకీయ లింకులు, ఇంట్లోనే మిషన్ పెట్టి ధైర్యంగా ప్రింట్ చేయడం వంటివాటికి వెనుక జరిగే కథను మాత్రం పోలీసులు వెల్లడించడంలేదు. దీనిని బట్టి వెనుక ఎవరున్నారు అన్నది అర్ధమైపోతుంది.
తాజాగా కర్ణాటకలో వైసీపీ మహిళా నేత ఒకరు పెద్దఎత్తున దొంగనోట్లతో అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజని ఓ కుల కార్పొరేషన్ డైరెక్టర్. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రధాన అనుచరురాలు. ఎమ్మెల్యే ఏ పని చెప్పినా చేస్తుంటారు. అందుకే ఆమె కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇప్పించారు. అటువంటి ఆమె పెద్ద ఎత్తున దొంగనోట్లతో పట్టుబడడంతో.. ఇప్పుడు ఎమ్మెల్య రాచమల్లుపై అందరూ అనుమానపు చూపులు చూస్తున్నారు. విపక్షాలు సైతం ఆయనపై ఆరోపణల డోసు పెంచడంతో ఎమ్మెల్యే డిఫెన్స్ లో పడిపోయారు.

ఈ నెల ఒకటో తేదీన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో వలంటీరు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఓ వృద్ధురాలు ఆ నగదు తీసుకొని బ్యాంక్ కు వెళ్లగా సిబ్బంది దొంగ నోటుగా తేల్చారు. దీంతో కథ పోలీసుల వరకూ వెళ్లింది. అయితే ఆ నగదు పై అధికారులే ఇచ్చారని వలంటీరు నెత్తీనోరు బాదుకొని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు పోలీసులు వలంటీరే దొంగనోటు పంచాడని నిర్ధారించి అక్కడితే కేసు ముగించారు. కానీ దాని వెనుక ఎవరున్నారు అనేది బయటకు తీయలేదు. ఇలా ఏపీ ఆర్థిక వ్యవస్థలోకి దొంగనోట్లు ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికక్కడే అధికార పార్టీకి లింకులు కనిపిస్తుండడంతో పోలీసులకు కూడా సవాల్ గా మారుతోంది