YCP Leaders: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పెడదారి పట్టాయి. భౌతిక దాడులకు తెగబడుతూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ దూకుడు పెంచుతోంది. రాజకీయ విలువలకు తిలోదకాలిస్తూ నీతిమాలిన చర్యలకు పూనుకోవడం దారుణం. దీనికి కారణం అధికార పార్టీ నేతలకు అధినేత నుంచి వచ్చిన సంకేతమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పరిణామాలపై రాష్ర్టంలో చర్చలు జరుగుతున్నాయి. రెచ్చిపోయిన నాయకులు గూండాల్లా చెలరేగిపోవడం స్పష్టంగా కనిపించింది. దీనిపై పలు కోణాల్లో విమర్శలు వస్తున్నాయి.

రాష్ర్టంలో పరిస్థితి మరింత దిగజారిపోయిందని తెలుస్తోంది. అధికార పార్టీ వైసీపీ చేస్తున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. గతంలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం వెనుక ఆంతర్యమేమిటని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్టాభి వ్యాఖ్యలపై వైసీపీ దూకుడు ప్రదర్శించి విమర్శలు మూటగట్టుకుంది.
2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు, టీడీపీకి కేవలం 20 సీట్లే వచ్చాయి. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల బలమున్న వైసీపీ టీడీపీకి భయపడి భయోత్పాతాన్ని సృష్టించడం వారి అనైతిక చర్య అనిపిస్తోంది. కానీ టీడీపీ మాత్రం వైసీపీపై వ్యూహాత్మకంగానే విమర్శలు చేస్తూ దాన్ని అభాసుపాలు చేస్తోందని సమాచారం. దీంతో ఇరుక్కుంటున్నది వైసీపీ అని అందరికి అర్థమవుతోంది.
విపక్షాలకు చెక్ పెట్టాలంటే మాటలతోనే కానీ చేతలతో మాత్రం కాదని తెలుసుకోవాలి. ఇలాగైతే వైసీపీకి నష్టమే ఎక్కువగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ మాత్రం తన పరపతి పెంచుకుంటూ రాబోయే ఎన్నికల్లో తన ప్రభావం చూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ మొండి వైఖరే దీనికి ప్రధాన కారణమనే విమర్శలు సైతం వస్తున్నాయి.