AP Crime : నడిరోడ్డుపై ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి పాల్పడిన వ్యక్తులను ఎట్టకేలకు ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిందితులపై కేసులు నమోదు చేసింది. వారిని అదుపులోకి తీసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీ 16 జెడ్ 0702 నంబరు బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది. ట్రంక్ రోడ్డు మీదుగా వెళుతున్నప్పుడు ఓ ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డంగా ఉంది. బస్సు డ్రైవర్ బిఆర్ సింగ్ హారన్ మోగించారు. దీంతో వాహనదారుడు డ్రైవర్ తో వాదనకు దిగాడు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రావడంతో వాగ్వాదానికి దిగిన వాహనదారుడు వెళ్ళిపోయాడు.
బస్సు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత.. ఓ కారు వెంబడిస్తూ బస్సు ముందు ఆగింది. కారు నుంచి ఓ 14 మంది దిగారు. బస్సు డ్రైవర్ను కిందకు దింపేశారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాలితో కడుపులో తన్నారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో అస్వస్థతకు గురై డ్రైవర్ కింద పడినా వదిలిపెట్టలేదు. ఇక్కడే చంపి పాతి పెడతాం. ఎవరొస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. ఈ దారుణ ఘటనను అక్కడున్నవారు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా అడ్డుకున్నారు. అయినా కొంతమంది రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో దాడి చేసిన వారంతా వైసీపీ నేతలుగా తేలింది.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సు డిపోల్లో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఇదో రాష్ట్రస్థాయి ఉద్యమంగా మారుతుందని భావించిన ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనలో పాల్గొన్న 19 మంది పై కేసులు నమోదు చేసింది. దాడి ఘటన అనంతరం నిందితుల్లో కొందరు శనివారం కార్లలో చెన్నైకి పారిపోతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. అందులో కీలక నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో కీలక నిందితులు అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు కావడం గమనార్హం. వారి పేర్లు వెల్లడించడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. మొత్తానికైతే ఈ వివాదం మొదలకుండానే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడం విశేషం.