
YCP Politics :రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. రాత్రికి రాత్రే పదవులు దక్కించుకున్న వారూ ఉన్నారు. ఏళ్ల తరబడి పడిగాపులు కాసినా అవకాశాలు రానివారు ఉన్నారు. ఒక్కోసారి స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణలు కొందరికి ఇట్టే కలిసొస్తాయి. పదవులే ఎదురొచ్చి పలకరిస్తాయి. ఇటువంటి అదృష్టాన్ని దక్కించుకున్నారు పలాస ఎమ్మెల్యే, ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. ఆయన పొలిటికల్ ఎంట్రీ అనూహ్యం. ఆపై వైసీపీ టిక్కెట్.. ఎమ్మెల్యే..మంత్రి ఇలా ఒకదాని తరువాత ఒకటి వరించింది. అయితే అదృష్టాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు మంత్రి సీదిరి. గత ఎన్నికల్లో తనను గెలిపించిన వారినే దూరం చేసుకుంటున్నారు. విసిగి వేశారిన కొందరు నేతలు ఎదురుతీరగగా.. మరికొందరు అదును కోసం వెయిట్ చేస్తున్నారు.దీంతో పలాస నియోజకవర్గంలో అధికార పార్టీ ఎదురీదుతోంది.
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సాధిస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఎక్కడికక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలకు దిగువ స్థాయి కేడర్ తో గ్యాప్ ఉంది. కొన్నిచోట్ల పూడ్చుకోలేనంతగా అగాధం ఏర్పడింది. పలాసలో అయితే మంత్రిపై ద్వితీయ శ్రేణి నాయకులే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎంతో కష్టపడి గెలిపిస్తే.. మంత్రులు, ఆయన ప్రధాన అనుచరులు అవినీతికి పాల్పడుతున్నారంటూ అసమ్మతి నాయకులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి అప్పలరాజుకు టిక్కెట్ ఇస్తే పనిచేయలేమని తేల్చిచెబుతున్నారు. వన భోజనాల పేరిట ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసుకొని మరీ అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నారు. దీంతో మంత్రి ముచ్చెమటలు పడుతున్నారు.
అప్పలరాజుకు మంత్రి పదవి వచ్చిన తరువాత ఆయనపై అవినీతి ఆరోపణలు పెరిగాయి. కొందరు కీలక అనుచరులతో ఆయన భూదందాలకు పాల్పడుతున్నట్టు కూడా విమర్శలు వచ్చాయి. ఓ భూ వ్యవహారంలో మావోయిస్టుల నుంచి బెదింపులు రావడం కలకలం సృష్టించింది. అటు అప్పలరాజు దూకుడు స్వభావం కూడా ఆయనకు చేటు తెస్తోంది. నియోజకవర్గంలో శాంతిభద్రతలు గాడి తప్పడానికి మంత్రి వైఖరే కారణమంటూ ప్రజలు కూడా అనుమానిస్తున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ అసమ్మతి శిబిరం స్ట్రాంగ్ అవుతోంది. ఒక్కో నేత చేజారుతుండడంతో అప్పలరాజు ఆందోళనకు గురవుతున్నారు.
తాజాగా వైసీపీ సీనియర్ నాయకులు, అసమ్మతి నేతలు దువ్వాడ హేంబాబు చౌదరి, దువ్వాడ శ్రీకాంత్, జుత్తు నీలకంఠం తదితరులు ఒక నిజ నిర్థారణ కమిటీ వేశారు. మంత్రి, ఆయన అనుచరుల భూదందాపై ఒక నివేదిక తయారుచేసే పనిలో పడ్డారు. గ్రామాల వారీగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రైవేటు ల్యాండ్స్ డీల్ వంటి వివరాలతో ఒక నివేదిక తయారుచేసి పార్టీ హైకమాండ్ కు నివేదించనున్నట్టు ప్రకటించారు. అటు అధిష్టానం కూడా మంత్రి సీదిరి వైఖరిపై మంచి అభిప్రాయంతో లేదు. దూకుడుతో అందర్నీ దూరం చేసుకోవడాన్ని పార్టీ పెద్దలు తప్పుపడుతున్నారు. ఇప్పటికే అప్పలరాజుకు సుతిమెత్తని హెచ్చరికలు చేశారు. అయితే అసమ్మతి నేతలను ఎలా కట్టడి చేయాలో తెలియక మంత్రి తల పట్టుకుంటున్నారు.